Effects Of Maternal Obesity On Baby : గర్భధారణకు ముందు, గర్భం ధరించిన సమయంలో ఊబకాయం గల మహిళలకు పుట్టే పిల్లలకు ఆటిజమ్, ఏడీహెచ్‌డీ వంటి నాడీ అభివృద్ధి సమస్యల ముప్పు పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో బయటపడింది. ఏడీహెచ్‌డీ పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుందని వెల్లడైంది. ఇలాంటి పిల్లలు కాసేపు అయినా దేని మీదా శ్రద్ధ పెట్టరని, అతి చురుకు దనంతో ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆటిజమ్ పిల్లలైతే ఒకే విధంగా పనులు చేస్తుంటారని.. ఇతరులతో మాట్లాడటం, కలవటంలో ఇబ్బంది పడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ఎందుకొస్తాయనేది కచ్చితంగా తెలియదు గానీ కారణాలను అన్వేషించటానికి శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన పరిశోధనలు వారి ఓ కొత్త దారిని చూపాయి. అవేంటో ఇప్పడు తెలుసుకుందాం.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాతో పాటు ఇతర సంస్థలకు చెందిన పరిశోధకులు ఊబకాయం గల మహిళకు సంబందించిన 42 అధ్యయనాలను సమీక్షించారు. అందులో భాగంగా సుమారు 36 లక్షల మాతా, శిశు జంటల వివరాలు పరిశీలించారు. గర్భధారణ సమయంలో మహిళల్లో ఊబకాయం కారణంగా పిల్లల్లో ఏడీహెచ్‌డీ ముప్పు 32% పెరుగుతున్నట్టు అలాగే ఆటిజమ్ ముప్పు రెట్టింపవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గర్భం ధరించటానికి ముందు అధిక బరువు, ఊబకాయం మూలంగా ఏడీహెచ్‌డీ ముప్పు వరుసగా 18%, 57% అధికంగా ఉంటున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది. ఇక ఆటిజమ్ విషయానికి వస్తే- గర్భధారణకు ముందు అధిక బరువుతో 9%, ఊబకాయంతో 42% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పిల్లలకు ప్రవర్తన సమస్యలు వచ్చే అవకాశం 30%, తోటివారితో కలవలేకపోయే ముప్పు 47% అధికమనీ వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సంతానం కనే వయసులో ఉన్న మహిళల్లో ఊబకాయం, పిల్లల్లో ఏడీహెచ్‌డీ వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యం మీద ఊబకాయం దీర్ఘకాల ప్రభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పరిశోధకులు వెల్లడిస్తున్నాురు.
ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలకు వాహనాలు తప్పకున్నా కూరగాయల మార్కెట్టు, కొద్ది దూరంలో ఉన్న బంధుమిత్రుల ఇళ్లకు లేదా పార్కుకు కాలి నడకన వెళ్లడం అలవాటు చేసుకుంటే అది మంచి వ్యాయామం అవుతుంది. ఊబకాయ సమస్యలు తగ్గుతాయని, అనారోగ్యాలూ దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.