2025 New Year Celebrations : సరికొత్త లైటింగ్స్, లేజర్ షోలు, టపాసుల మోతలు, కేక్ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2025 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. అర్ధరాత్రి వరకు ఆడిపాడిన ప్రజలు గడియారంలో 12 మీదకి ముళ్లు వెళ్లగానే కొత్త ఏడాదికి గట్టిగా కేరింతలతో ఘనస్వాగతం పలికారు. ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ యావత్ దేశం 2025కి ఘన స్వాగతం పలికింది. బాణసంచా కాంతి వెలుగుల్లో హైదరాబాద్ వంటి నగరాలు శోభాయమానంగా కాంతులీనుతున్నాయి.
కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం : ప్రముఖ నగరాలు కొత్త సంవత్సరం సంబరాల వేళ విద్యుద్దీపాల వెలుగు జిలుగుల్లో మెరిశాయి. 2024కు వీడ్కోలు చెబుతూ 2025కు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుని సందడి చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. డిసెంబరు 31 మంగళవారం రాత్రి నుంచే ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో యువత ఉత్సాహంగా గడిపారు. లైవ్ కాన్సర్ట్లు, క్యాంప్ ఫైర్ లాంటి వాటిలో పాల్గొన్న స్నేహితులతో ఎంజాయ్ చేశారు.
పట్టణాల్లో స్వాగతం : హైదరాబాద్‌లో నయాసాల్ జోష్‌తో యువత ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు. బేకరీలు, బార్లు, రెస్టారెంట్లలో రద్దీ పెరిగింది. రెస్టారెంట్లలో హైదరాబాద్ బిర్యానీకి డిమాండ్ భారీగా ఏర్పడింది. పలుచోట్ల రెస్టారెంట్ల ముందు జనం బారులు తీరారు. సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్ర ప్రాంతం దగ్గర ఓ రెస్టారెంట్ ముందు జనం భారీగా క్యూలైన్ కట్టారు.
కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడానికి పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, వరంగల్, గుంటూరు, రాజమహేంద్రవరం తదితర అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి కొత్త సంవత్సరానికి స్వాగతం, హ్యాపీ న్యూఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పల్లెల్లోని యువత వణుకుతున్న చలిలో కూడా రకరకాల కార్యక్రమాలతో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. గ్రామాలలోని ప్రజలు వారి వారి కుటుంబాలతో కలిసి వివిధ ఆటలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త సంవత్సరం ప్రారంభ రోజు కావడంతో జనవరి 01న రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రాష్ట్ర ప్రజలకు న్యూఇయర్ విషెస్ తెలుపారు.
ప్రపంచదేశాల్లో గ్రాండ్గా న్యూఇయర్ వేడుకలు- రష్యాలో మాత్రం నో సెలబ్రేషన్స్!
న్యూఇయర్ జోష్ - ఆలయాలకు పోటెత్తిన భక్తులు, పలుచోట్ల ఇబ్బందులు