Bitter Gourd Juice Benefits for Hair:కాకరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా మందికి తెలుసు. కానీ, కాకరకాయ రసం కురుల అందాన్నీ ఇనుమడిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఈ కాకర రసం తరచూ కుదుళ్లు, జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుముఖం పడుతుందని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కాయగూర వివిధ రకాల జుట్టు సమస్యల్ని ఎలా దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలుతోందా?
ఇందుకోసం అరకప్పు కాకర రసాన్ని తీసుకొని అందులో చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టు మొత్తానికి బాగా పట్టించి.. పది నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా ఈ మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో Journal of Cosmetics, Dermatological Sciences and Applicationsలో ప్రచురితమైన "Evaluation of Hair Growth Promoting Activity of Momordica charantia Extract" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చివర్లు చిట్లితే
మనం ఉపయోగించే హెయిర్‌కేర్ ఉత్పత్తుల్లోని రసాయనాలు, బయట కాలుష్యం ప్రభావం కారణంగా చాలామందిలో జుట్టు చివర్లు చిట్లుతుంటాయి. అయితే, దీన్ని నివారించడానికి సరిపడినంత కాకరకాయ రసాన్ని తీసుకొని కురులకు పట్టించి వదిలేయాలి. సుమారు 40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చొప్పున చేస్తే.. మూడు వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.
చుండ్రు మాయం!
ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అనంతరం దీన్ని కాకర రసంలో కలిపి కుదుళ్లకు పట్టించాలి. కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.