House Cleaning Tips Telugu: ఇల్లు శుభ్రంగా, అందంగా కనిపించాలని ప్రతి ఇల్లాలు అనుకుంటుంది. ఇంకా దీని కోసం ఎంతో కష్టపడుతుంది. కానీ వంట, పిల్లలు.. ఇంకా కొందరికి ఆఫీసు పనులు ఇలా అనేక కారణాలతో ఇల్లు సర్దే పనులు వాయిదావేస్తుంటారు. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు చేద్దాంలే అనుకుంటారు. ఆ తర్వాత సమయం దొరకక, ఏ పండగలప్పుడో సర్దుకునే సరికి పని కొండంత అయిపోతుంది. అయితే, ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు 1- 3- 5 నియమాన్ని పాటిస్తే చాలంటున్నారు నిపుణులు. దీని వల్ల ఈజీగా ఇల్లును సర్దుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1- 3- 5 రూల్ అంటే ఏంటి?
1- 3- 5 రూల్ అంటే ఒక పెద్దపని, మూడు మధ్యతరహావి, అయిదు చిన్న చిన్న పనులని అర్థం. అయితే, రోజూ ఈ నియమాన్ని పాటిస్తూ వెళ్లాలని నిపుణులు అంటున్నారు. పెద్దపని అన్నారు కదా అని కిచెన్ అంతా సర్దేస్తా, కబోర్డంతా దులిపేస్తా అని పెట్టుకుంటే రోజూ అలసటే మిగులుతుంది. ఇంకా ఇలా చేస్తే మిగతా 3+ 5 పనులెలా పూర్తవుతాయి? అందుకే ఎలాగూ రోజూ కొనసాగించాలని అనుకున్నాం కాబట్టి, పనుల్ని విభజించుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు పడకగదినే తీసుకుంటే అందులో కబోర్డులో ఒక అరను ఈరోజు సర్దడం, లేదంటే అరగంట ఈ పని చేస్తా అని నియమం పెట్టుకోవాలని చెబుతున్నారు.
అనంతరం ఆరోజుకి అక్కడితో ఆపేసి తర్వాత 5-10 నిమిషాలు పట్టే మూడు పనులు చేయాలని సూచిస్తున్నారు. దుస్తులు మడత పెట్టడం, కడిగిన గిన్నెలు అరల్లో సర్దడం ఏదైనా చేయచ్చు. ఆ తర్వాత అయిదు నిమిషాల్లోపు వాటిని అంటే టీపాయ్ తుడవడం, దానిపై ఉండే వస్తువులను సర్దడం, రిమోట్ స్టాండ్ శుభ్రం చేయడం లాంటివి చేయాలట. ఇలా అన్నీ చేసేస్తే ఆరోజుకి సరిపోతుంది. అయితే, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చేయాలన్న నియమమూ లేదని.. మీకెప్పుడు తోస్తే అప్పుడు చేయొచ్చని అంటున్నారు. ఏమేం చేయాలన్నది పొద్దున్నే ఓసారి అనుకోవడమో కాగితం మీద రాసుకోవడమో చేస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయన్న కంగారూ పడవద్దని నిపుణులు అంటున్నారు. ఒకరోజు తీసేయాల్సినవి పక్కనపెట్టాలని.. రెండోరోజు శుభ్రత, మూడోరోజు సర్దుకోవాలని సూచిస్తున్నారు. ఇలా ఇక్కడ ఆరోజుకి పర్‌ఫెక్ట్‌గా పూర్తవ్వాలన్న తొందరేమీ వద్దని.. నెమ్మదిగానే చేసుకుంటూ వెళ్లండని తెలిపారు. ఇలా చేస్తే పోనుపోనూ మీకు ఇదో అలవాటుగా మారుతుందని.. క్రమంగా ఇల్లూ శుభ్రంగా ఉంటుందని వివరిస్తున్నారు.
ఇంట్లో వైర్లు, బోర్డులు బయటకు కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే రూమ్ అందంగా కనిపిస్తుందట!
గోడలపై గీతలు, ఫర్నీచర్‌పై మరకలు మొత్తం పోతాయ్! హోమ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్!!