Zelenskyy Russia Ukraine War : ఉక్రెయిన్- రష్యాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి శాంతిని బహుమతిగా ఎవరూ ఇవ్వలేరని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ వైపే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కొత్త ఏడాది సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"శాంతిని మాకు ఎవ్వరూ బహుమతిగా ఇవ్వలేరని తెలుసు. అయితే 34 నెలలుగా రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకోవడంలో అమెరికా మా వైపే ఉంటుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడును ట్రంప్ ఆపుతారని అనడంలో మాకు ఎటువంటి సందేహాలు లేవు. ఇరు పక్షాలను శాంతపరచడానికి ఇది సాధారణ వీధి గొడవ కాదు. ఇప్పుడు రష్యా మీకు షేక్ హ్యాండ్ ఇస్తే, రేపు చంపదని గ్యారెంటీ కూడా లేదు. అయితే రష్యన్లకు స్వేచ్ఛ అన్న, స్వేచ్ఛగా ఉండేవారన్న భయం. కొత్త ఏడాదిలో ఉక్రెయిన్ బలంగా ఉండటానికి మనమందరం అందరం కలిసి పోరాడాలి" అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
2022 ప్రారంభం నుంచే రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇప్పట్లో ముగింపు ఛాయలు ఎక్కడా కనిపించట్లేదు. కీవ్‌తో యుద్ధంలో దాదాపు 10 వేల మంది నార్త్ కొరియా సైనికులు మాస్కో తరఫున పోరాడుతున్నారు. అయితే తొలుత వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి యుద్ధంలో దింపినప్పటికీ, భాష సమస్య కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. కీవ్ బలగాల చేతుల్లో హతమవుతున్నారని కూడా పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.