Trump Inauguration Delay :ఏ దేశంలోనైనా ఎన్నికల ఫలితాలు వెలువడగానే, వీలైనంత త్వరగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతాయి. కానీ అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన వారు మాత్రం పదవి చేపట్టడానికి కనీసం రెండు నెలలకుపైగా (75 రోజులు) వేచి చూడాల్సిందే. దీనిని ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. నవంబరు తొలివారంలో ఎన్నికైతే, జనవరి మూడోవారం దాకా ఎందుకు ఆగాలి? ఎందుకింత ఆలస్యం?
తొలి అధ్యక్షుడు ఏప్రిల్‌లో
అధ్యక్షుడి పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందో అమెరికా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పలేదు. అధ్యక్షుడి పదవీకాలం 4 ఏళ్లు అని మాత్రమే క్లుప్తంగా రాసి ఉంది. అయితే 1788 సెప్టెంబరులో అమెరికా రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, మార్చి 4న కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాలని నిర్ణయించారు. ప్రతినిధుల సభ, సెనెట్ ఎన్నికలు పూర్తి చేసుకొని, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు వారంతా చలికాలంలో న్యూయార్క్‌కు రావటానికి (అప్పటి రవాణా వ్యవస్థల దృష్ట్యా) సమయం పడుతుందనే ఉద్దేశంతో ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ అమెరికా తొలి అధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ 1789 మార్చి 4న ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఏప్రిల్ 30న ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మాత్రం 140 సంవత్సరాల పాటు మార్చి 4నే నూత అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతూ వచ్చాయి.
20వ సవరణతో
ఎన్నికలు పూర్తయిన 4 నెలల వరకు పాత ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ కొంతమంది సెనెటర్లు పోరాటం చేశారు. దీని ఫలితంగానే అమెరికా రాజ్యాంగంలో 20వ సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం 1934 నుంచి కొత్త పార్లమెంటు (ప్రతినిధుల సభ, సెనెట్) జనవరి మొదటివారంలో కొలువుదీరటం ఆరంభమైంది. 1937 నుంచి కొత్త అధ్యక్షుడి ప్రమాణాన్ని మార్చి 4 నుంచి జనవరి 20కి మార్చారు. అంటే జనవరి 20 మధ్యాహ్నం పాత అధ్యక్షుడి పదవీకాలం ముగుస్తుంది. అంటే ఇంకా 2 నెలల పాటు జో బైడెనే అధ్యక్షుడిగా ఉంటారు. ఈలోపు ప్రభుత్వ మార్పిడికి సంబంధించిన తెరవెనక కార్యక్రమాలు జరుగుతాయి. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తన ప్రభుత్వాన్ని, అందులో కీలక స్థానాల్లో ఎవరెవరు ఉండాలో నిర్ణయించుకుంటారు. ఈ లోపు డిసెంబరు 17న ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై లాంఛనంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. జనవరి 6న అమెరికా కొత్త కాంగ్రెస్ (అధ్యక్ష ఎన్నికతో పాటే ప్రతినిధుల సభకు, సెనెట్‌కు కూడా ఎన్నికలు జరిగాయి) ఆ ఎన్నికకు ఆమోదముద్ర వేస్తుంది.
ట్రంప్‌ను కమలే ధ్రువీకరించాలి!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి, తన ప్రత్యర్థి గెలిచారని స్వయంగా ధ్రువీకరించి, ప్రకటించాల్సి ఉంటుంది. ఓడిపోయిన వారికి ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. ప్రస్తుత ఎన్నికల్లో కమలా హారిస్ ఓడిపోయారు. కానీ ఆమే ట్రంప్ విజయాన్ని స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది. మంగళవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించి, మెజారిటీకి అవసరమైన 270 కంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ సీట్లను గెల్చుకున్న సంగతి తెలిసిందే.
అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభ, సెనెట్ సంయుక్త సమావేశానికి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవారు అధ్యక్షత వహించాల్సి ఉంటుంది. అంటే ఈసారి ఆ బాధ్యత కమలా హారిస్ నిర్వర్తిస్తారు. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని కమలా హారిస్ స్వయంగా ప్రకటిస్తారు. అయితే తనకు ఇష్టం లేకుంటే ఆమె ఈ ప్రక్రియ నుంచి గైర్హాజరయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొత్త అధ్యక్షుడి ప్రకటన బాధ్యతను అధ్యక్షుడు జోబైడెన్ సెనెట్‌లో ఎవరో ఒకరికి అప్పగిస్తారు. గత 70 ఏళ్లలో మూడుసార్లు ఇలాంటి సందర్భాలు వచ్చాయి. చివరిసారి 2000 సంవత్సరంలో జార్జ్‌బుష్ చేతిలో ఓడిపోయిన అప్పటి ఉపాధ్యక్షుడు అల్‌గోర్ స్వయంగా ఆయన్ను అధ్యక్షుడిగా ప్రకటించారు. ఒకవేళ ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిచి ఉంటే, తన విజయాన్ని తనే ప్రకటించుకునే అరుదైన అవకాశం లభించేది.