తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో మరో కొత్త వైరస్ కలకలం - కొవిడ్​ తరహా లక్షణాలతో! - NEW VIRUS IN CHINA

వామ్మో! చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్​ - అందరూ జర జాగ్రత్త పడాల్సిందే!

HMPV Virus In China
HMPV Virus In China (Associated Press (Representative Image))

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 7:57 AM IST

HMPV Virus In China : కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV) చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్‌ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది.

కరోనా కూడా!
హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్‌లు కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ, దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్‌ సోకిన వారిలో కొవిడ్ తరహాల లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఔను నిజమే!
చైనాకు చెందిన 'సీడీఎస్' వెబ్‌సైట్‌ ప్రకారం ఈ హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ అనేది ఆర్​ఎన్​ఏ వైరస్‌. దీన్ని 2001లో తొలిసారి డచ్‌ పరిశోధకులు గుర్తించారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లల నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇది బయటపడింది. ఈ వైరస్‌ ప్రధానంగా దగ్గు, తుమ్ముల ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, కలుషితమైన వాతావరణాలకు గురికావడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.

ఈ వైరస్‌ పొదిగే కాలం మూడు నుంచి ఐదు రోజులు. ఎక్కువగా శీతాకాలం, వసంతకాలంలో ఎక్కువగా ఇది వెలుగు చూస్తుంది. ఈ హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాసలో గురక వంటి లక్షణాలు దీనికి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది బ్రోన్కైటిస్, న్యుమోనియాకు కూడా దారితీయవచ్చు. ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదిక సారాంశం.

జర జాగ్రత్త పడాల్సిందే!
దాదాపు ఐదేళ్ల క్రితం కొవిడ్‌-19 వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్‌ కారకాలను గుర్తించేందుకు, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అక్కడి అధికార మీడియా 'సీసీటీవీ' వెల్లడించింది. అంతేకాదు డిసెంబరు 16 నుంచి 22 వరకు, ఈ వారం రోజుల వ్యవధిలోనే అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

'సరిహద్దుల్లోని సమస్యలకు చెక్- భారత్​తో కలిసి పనిచేసేందుకు చైనా రెడీ!'

అమెరికా ట్రెజరీపై సైబర్‌ ఎటాక్​ - బరితెగించిన చైనా హ్యాకర్స్​!

ABOUT THE AUTHOR

...view details