US Primary Elections Results :సూపర్ ట్యూస్‌డే పేరిట మంగళవారం అమెరికాలోని 15 రాష్ట్రాల్లో, ఒక టెర్రిటరీలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ దూసుకుపోయారు. ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన ట్రంప్ నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఒక్క వెర్మొంట్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు. వెర్మొంట్‌లో ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ విజయం సాధించారు. తాజా ఫలితాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీలో జో బైడెన్ మంగళవారం జరిగిన దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందినట్లు CNN వెల్లడించింది. ఒక్క సమోవా టెరిటరీలో మాత్రం జేసన్‌పామర్ చేతిలో ఆయన ఓడిపోయారు. లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్ పొందడానికి ట్రంప్ ఈ నెల 12 వరకు, బైడెన్ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది.
రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. సూపర్ ట్యూస్‌డే వరకు హేలీ ఖాతాలో 86
మంది, ట్రంప్ ఖాతాలో 956 మంది ఉన్నారు. అటు డెమోక్రటిక్ పార్టీలో బైడెన్‌కు 1968 ప్రతినిధుల మద్దతు అవసరం కాగా 994 మంది బైడెన్‌కు అనుకూలంగా ఉన్నారు.
సూపర్ ట్యూస్‌డే ఫలితాల తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అక్రమ వలసలపై విరుచుకుపడ్డారు. తాను మళ్లీ గెలిస్తే ఇంధన రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా మారుస్తానని హామీ ఇచ్చారు. అమెరికా గ్రేట్ అగేన్ నినాదంతో ఆయన పౌరులను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.