Trump Sanction On International Criminal Court : అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అంతర్జాతీయ సంస్థలపై దృష్టి సారించిన ట్రంప్ వాటిపై నియంత్రణ చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO, ఐరాస మానవ హక్కుల మండలి- UNHRC వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం-ICCపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.
ఈ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి. అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించే వారికి చెందిన ఆస్తుల్ని స్తంభింప చేయడం సహా వారి ప్రయాణాలపై నిషేధం విధించే అవకాశం ఉంది. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ICC నిరాధార దర్యాప్తులు చేపడుతోందని, అందుకే ఈ చర్యలకు దిగినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానం చర్యలు ప్రమాదకర ధోరణిలో ఉన్నాయని ట్రంప్ ధ్వజమెత్తారు. హింస, ఆరోపణలు, అరెస్టు వంటి వాటితో అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూపై అరెస్టు వారెంట్ జారీ చేసి ICC తన అధికారాలను దుర్వినియోగం చేసిందని ట్రంప్ మండిపడ్డారు. ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపులను, ఇరాన్‌ను పట్టించుకోకుండా తనను తాను రక్షించుకునే హక్కున్న ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం ఆంక్షలు విధిస్తోందని ట్రంప్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఐసీసీలో సభ్యదేశాలు కాదని, తమపై ఐసీసీకి ఎలాంటి అధికారాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గాజాలో యుద్ధ నేరాలు, అమానుష చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై గతేడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అటు అమెరికా ఆంక్షలు విధించడాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ఖండించింది. ఈ చర్యలు కోర్టు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయపరమైన విధులకు హాని కలిగించే ప్రయత్నంగా అభివర్ణించింది. ఈ ఆంక్షలకు వ్యతిరేకంగా తమ గొంతును వినిపించాలని ఐసీసీ తన సభ్యదేశాలను కోరింది. న్యాయం, ప్రాథమిక హక్కుల కోసం 125 సభ్య దేశాలు తమవైపు నిలబడాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అమాయక బాధితులకు న్యాయం చేసేందుకు తమ విధులు కొనసాగుతాయని చెప్పింది.