US Election Kamala Vs Trump :అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 5న జరిగే పోలింగ్ కోసం అధికార డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. స్వింగ్ స్టేట్స్లో ఓటర్లను ఆక్షర్షించడానికి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం సమీపించినా ఇద్దరిలో ఒక్కరికీ స్పష్టమైన మెజారిటీ కనిపించడం లేదు. ఎవరు తదుపరి అధ్యక్షుడు అవుతారోనని అంశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వెలువడిన పలు సర్వేల అంచనాలు తుది ఫలితాలకు దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు వెలువడిన పలు సర్వేలు హారిస్-ట్రంప్ మధ్య టైట్ ఫైట్ ఉంటుందని అంచనా వేశాయి. బుధవారం విడుదలైన ఫాక్స్ పోల్ ప్రకారం, స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, నార్త్ కరొలినాలో ట్రంప్- హారిస్ కంటే ఒక శాతం పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఇక మిషిగన్ రాష్ట్రంలో ఇద్దరి మధ్య టై అవుతుందని- అరిజోనా, నెవాడా, జార్జియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు నెలకొంటుందని ఫాక్స్ పోల్ అంచనా వేసింది.
ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు పెన్సిల్వేనియాలో 48 శాతం ఓట్లతో టై అవుతుందని, సీఎన్ఎన్ పోల్ అంచనా వేసింది. విస్కాన్సిన్ లో 4శాతం పాయింట్లు, మిషిగన్‌లో 5శాతం పాయింట్లతో ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో ఉన్నారని తెలిపింది. ఇక సీబీఎస్ పోల్ ప్రకారం పెన్సిల్వేనియాలో 49శాతం ఓట్లతో ఇద్దరికి టై అవనుంది. అమెరికా అధ్యక్షుడు కాలాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం.
ఒబామా ఫోర్త్ టర్మ్!
కమలా హారిస్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే, అది ఒబామా నాల్గవ టర్మ్ అవుతుందని వాల్ స్ట్రీట్ జనర్నల్ తన సంపాదకీయంలో అభిప్రాయపడింది. ఇక హారిస్ మిషిగన్, విస్కాన్సిన్, నెవాడాలో లీడ్‌లో ఉన్నారని- కానీ పెన్సిల్వేనియాలో ఆమె అధిక్యం గత వారంలో తగ్గిపోయిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అరిజోనా, జార్జియా, నార్త్ కరొలినాలో ట్రంప్ అధిక్యంలో ఉన్నారని వెల్లడించింది.
బెట్టింగ్ మార్కెట్ల్ ట్రంప్ హవా
జాతీయ స్థాయిలో హారిస్ కంటే 0.4శాతం పాయింట్లతో ట్రంప్ ముందంజలో ఉన్నారని ఇప్పటివరకు వచ్చిన పోల్స్ వివరాలను విశ్లేషించి రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ అంచనా వేసింది. స్వింగ్ స్టేట్స్లో ఒక శాతం ట్రంప్ లీడ్‌లో ఉన్నారని తెలిపింది. ఇక బెట్టింగ్ మార్కెట్లో 63.1 పాయింట్లతో ట్రంప్ దూసుకెళ్తున్నారు. హారిస్ 35.8 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
ఎన్నికలపై అమెరికన్ల మిక్స్డ్ ఎమోషన్స్!
అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై 10 మందిలో ఏడుగురు అమెరికన్లు విసుగు, ఆందోళన చెందుతున్నారని AP-NORC- సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. అంతే మొత్తంలో ఆసక్తిగా ఉన్నట్లు చెప్పింది. ఇక మూడింట ఒకటోవంతు ఉత్సాహంగా ఉన్నట్లు వెల్లడించింది. గతంలో పోలిస్తే ఈసారి ఎన్నికలపై అమెరికన్ల భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నాయని తెలిపింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఓటర్లలో నిరాశ స్థాయి స్థిరంగా ఉందని చెప్పింది. 10మందిలో ఏడుగురు తాము నిరాశకు గురయ్యామని, 2020లో మాదిరిగానే తమ పరిస్థితి ఉన్నట్లు వివరించినట్లు పేర్కొంది.