US Arrests Illegal Immigrants :అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు మొదలుపెట్టారు. ఇప్పటికే 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. తాజా పరిణామాలపై శ్వేతసౌధం (వైట్‌హౌస్) స్పందించింది. గతంలో వాగ్దానం చేసినట్లుగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు బలమైన సందేశాన్ని పంపిస్తున్నారని పేర్కొంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ మరోసారి ట్వీట్ చేసింది. అంతేకాదు అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరలించే విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
వాళ్లంతా నేరస్థులే!
ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారని వైట్ హౌస్ పేర్కొంది. మరో 373 మంది నిర్బంధించినట్లు తెలిపింది. అరెస్టైన వారిలో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని పేర్కొంది. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ అని వెల్లడించింది.
అక్రమ వలసలకు వ్యతిరేకం - భారత్
అక్రమ వలసదారులపై అమెరికా చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో, వీటిపై భారత్ స్పందించింది. అక్రమ వలసలకు తాము కూడా వ్యతిరేకమని పేర్కొంది. ఎందుకంటే అక్రమ వలసలు అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికా/ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని స్పష్టం చేసింది.