Israel Hamas Hostage Exchange : కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ మిలిటెంట్ సంస్థ శనివారం మరో నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది. ప్రతిగా ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న 200 మంది పాలస్తీనా ఖైదీలకు విముక్తి కల్పించింది.
హమాస్ విడుదల చేసిన నలుగురు మహిళలూ ఇజ్రాయెల్ సైన్యానికి చెందినవారే. హమాస్ బలగాలు గాజా సిటీలోని పాలస్తీనా స్క్వేర్ వద్ద పరేడ్ నిర్వహించి, ఆ నలుగురిని రెడ్‌క్రాస్ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో నలుగురు యువతులు సైనిక దుస్తులు ధరించి ఉన్నారు. 15 నెలల తర్వాత తమ వారిని చూసుకున్న కుటుంబీకులు ఆనందంతో కన్నీరుమున్నీరయ్యారు. ఆ నలుగురి పేర్లు కరీనా అరీవ్, డానియెల్ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారిని 2023, అక్టోబర్ 7న హమాస్ బంధించి తీసుకెళ్లింది. 477 రోజులుగా వారు ఆ గ్రూప్ చెరలోనే మగ్గిపోయారు.
This is the moment 🫶
— Israel Defense Forces (@IDF) January 25, 2025
Welcome home Liri, Daniella, Karina and Naama. 🇮🇱 pic.twitter.com/1DAbWX9Ix4
200 మందిని విడుదల చేసిన ఇజ్రాయెల్
ఇక ఇజ్రాయెల్ విముక్తి కల్పించిన 200 మంది ఖైదీల్లో జీవిత ఖైదు సహా పలు శిక్షలు అనుభవిస్తున్నవారు ఉన్నారు. వారికి గాజా లేదా వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వలేదు. రఫా సరిహద్దు గుండా ఈజిప్టుకు వారు వచ్చినట్లు ఆ దేశ మీడియా తెలిపింది.
2023 అక్టోబర్7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్- 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా తీసుకెళ్లింది. హమాస్‌ను మట్టుబెట్టేందుకు గాజాపై దండెత్తిన ఇజ్రాయెల్ 46 వేల మందికి పైగా ప్రాణాలు తీసింది. చివరకు అమెరికా, ఖతార్, ఈజిప్టు వంటి దేశాల మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాయి. 42 రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులను తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.