US Aid To Ukraine : రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని కొనసాగించే విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సైనికపరమైన చేదోడును అందించేందుకు రూ.16వేల కోట్ల భారీ సహాయక ప్యాకేజీని అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాజధాని కీవ్‌లో దీనిపై అధికారిక ప్రకటన చేశారు. గత నెలలో అమెరికా సెనేట్ ఆమోదించిన రూ.5 లక్షల కోట్ల సహాయక ప్యాకేజీ నుంచే ఉక్రెయిన్‌కు ఈ సైనిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు.
రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ సిద్ధం చేసుకున్న ధాన్యం ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యం, బయోనిక్స్ కర్మాగారం, డ్రోన్ తయారీ కేంద్రాలను ఆంటోనీ బ్లింకెన్ సందర్శించారు. కష్టకాలంలో ఉక్రెయిన్ ఎంతో సమయోచితంగా, సన్నద్ధతతో వ్యవహరిస్తోందని ఆయన కితాబిచ్చారు. రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు సంబంధించిన అంతర్జాతీయ షిప్పింగ్ రూట్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైలు మార్గాల ద్వారా ఉక్రెయిన్ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు ధాన్యం ఎగుమతులు చేస్తున్నారు. కష్టకాలంలో చేసుకున్న ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఉక్రెయిన్ సిసలైన సామర్థ్యం బయటపడిందని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.
ఆంటోనీ బ్లింకెన్ (Source : Associated Press) ఆంటోనీ బ్లింకెన్ (Source : Associated Press) జెలెన్స్కీ విదేశీ పర్యటనలన్నీ వాయిదా
మరోవైపు ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన విదేశీ పర్యటనలను ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం టెలిగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించింది. పర్యటనలను రీషెడ్యూల్ చేయాలని తన బృందానికి జెలెన్స్కీ సూచించారు. దీంతో ఈ వారంలో జరగాల్సిన జెలెన్స్కీ స్పెయిన్, పోర్చుగల్ పర్యటనలు రద్దయ్యాయి.
గత వారం రోజులుగా ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతం లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేస్తోంది. దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని రష్యా సైన్యం భావిస్తోంది. దీన్ని ఉక్రెయిన్ దళాలు కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయి. రష్యా దాడుల వల్ల ఖార్కివ్ ప్రాంతంలో సరిహద్దు ప్రాంతాలకు చెందిన దాదాపు 8వేల మంది ప్రజలు వలస వెళ్లాల్సి వచ్చింది. ఉక్రెయిన్‌లోని తూర్పు డొనెట్స్క్ ప్రాంతంపూ పూర్తి పట్టు కోసం అదనపు దళాలను రష్యా రంగంలోకి దింపింది. ఉక్రెయిన్‌కు చెందిన ఉత్తర చెర్నిహివ్, సుమీ ప్రాంతాలపై రష్యా ఫిరంగులు విధ్వంసక దాడులు చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు తాము కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నామని తెలుపుతూ, మంగళవారం రాత్రి జెలెన్స్కీ మంగళవారం రాత్రి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
రష్యాపై ఉక్రెయిన్ ప్రతిదాడుల పరంపర
బుధవారం తెల్లవారుజామున రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ తొమ్మిది డ్రోన్లు, రెండు రాకెట్లు, రెండు యాంటీ రాడార్ క్షిపణులు, రెండు హామర్ గైడెడ్ బాంబులను సంధించింది. ఈ ఘటనలో ఓ ఇల్లు కాలిపోగా ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కుర్స్క్ ప్రాంతంలో ఐదు ఉక్రేనియన్ డ్రోన్‌లను, బ్రయాన్స్క్ ప్రాంతంలో మూడు డ్రోన్‌లను కూల్చేశామని రష్యా సైన్యం వెల్లడించింది. మరో ఉక్రెయిన్ డ్రోన్‌ను టాటర్‌స్థాన్ ప్రాంతంలో కూల్చేశామని తెలిపింది. రష్యాలోని రోస్టోవ్ రీజియన్‌లో ఉన్న ఓ ఫ్యూయల్ డిపోపై రెండు ఉక్రేనియన్ డ్రోన్లు దాడి చేశాయని పేర్కొంది. గత కొన్ని నెలలుగా రష్యాకు చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన డిపోలు లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
'గేట్స్' ఫౌండేషన్‌కు మెలిండా రాజీనామా- రూ.లక్ష కోట్ల వాటా- బాధగా ఉందన్న మాజీ భర్త! - Melinda Gates Foundation
POKలో ఎట్టకేలకు ఆగిన హింస- ఆందోళనకారుల డిమాండ్లకు పాక్ సర్కార్ ఓకే - Pok Protests