Trump Biden Presidential Debate :అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ముఖాముఖి వాడీ వేడిగా జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకరినొకరు అబద్దాలకోరుగా విమర్శించుకున్నారు. అట్లాంటాలో గురువారం లైవ్ డిబేట్లో ఇరు పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ లైవ్ డిబేట్ 90 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది.
'ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పనలో బైడెన్ ఫెయిల్'
అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. అందుకు బైడెన్ సైతం ధీటుగా బదులిచ్చారు. ట్రంప్, తన హయాంలో సంపన్నులకు ప్రాధాన్యం ఇచ్చారని, ఫ్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని బైడెన్ ఆరోపించారు. కొవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయని అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. అబార్షన్ల విషయంలో రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం గురించి వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ నాయకులు కాదని అభిప్రాయపడ్డారు.
'ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టా'
అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం తాము దాన్ని గాడిలో పెట్టామని జో బైడెన్ డిబెట్లో తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ ధర 35 డాలర్లు ఉండగా తమ హయాంలో 15డాలర్లకు తగ్గించామని చెప్పుకొచ్చారు. కాగా బైడెన్ను డొనాల్డ్ ట్రంప్ ఫిర్యాదుదారుడిగా అభివర్ణించారు. దేశం మొత్తం ఆయన వల్ల ఇబ్బంది పడుతోందని ఆరోపించారు. దేశ ప్రజలు, విదేశీ నాయకులు కూడా బైడెన్ను గౌరవించరని విమర్శించారు.
అలా జరిగితే ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తా : ట్రంప్
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎన్నికలు జరిగితే అంగీకరిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారని అన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారని, ఆ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే, ఏ న్యాయస్థానాలు గుర్తించలేదని ఎద్దేవా చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ ఓడిపోయినా ఆయన దాన్ని అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు.