Trump On AI Project Stargate :కృత్రిమ మేధస్సు (ఏఐ టెక్నాలజీ)కు పెద్దపీట వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఏఐ మౌలిక సదుపాయాలలో రూ.43 లక్షల కోట్లు (500 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఓపెన్ ఏఐలతో కలిసి అమెరికా ప్రభుత్వం ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 'స్టార్ గేట్' పేరుతో ఏర్పాటయ్యే కొత్త కంపెనీ ఏఐ మౌలిక సదుపాయాల ఏర్పాటు కార్యకలాపాలపై ఫోకస్ పెడుతుందన్నారు. తద్వారా ప్రముఖ టెక్ కంపెనీలు అమెరికాలోని డేటా సెంటర్లలోనే పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని ట్రంప్ చెప్పారు. ఒరాకిల్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారి లారీ ఎలిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌లతో కలిసి వైట్ హౌస్‌లో ట్రంప్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
రూ.43లక్షల కోట్లతో 'స్టార్ గేట్'- AI విప్లవమే ట్రంప్ టార్గెట్! - TRUMP ON AI INFRASTRUCTURE
ఏఐ విప్లవంపై ట్రంప్ కీలక ప్రకటన- రూ.43 లక్షల కోట్లతో 'స్టార్ గేట్' కంపెనీ
Published : Jan 22, 2025, 12:31 PM IST
చైనాతో పోటీపడాలంటే
ఈసందర్భంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ 'స్టార్‌గేట్ కంపెనీ కోసం ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ ఏఐలు కూడా నిధులను సమకూరుస్తాయి. తదుపరిగా మరిన్ని కంపెనీలు కూడా ఈ భాగస్వామ్య సంస్థ (స్టార్ గేట్)లో చేరొచ్చు. అమెరికాలో ఏఐ మౌలిక సదుపాయాలను పెంచడమే మా లక్ష్యం. తద్వారా అమెరికన్లకు లక్షకుపైగా ఉద్యోగాలు వస్తాయి. చైనా సహా ఇతర దేశాలతో పోటీపడాలంటే ఏఐ రంగంలో అమెరికా దూసుకుపోవాలి. ఇందుకోసం భౌతిక మౌలిక సదుపాయాలు, వర్చువల్ వసతులు ఉండాలి. అవన్నీ మేం కల్పిస్తాం’’ అని ఆయన చెప్పారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను. భవనాల విలువ నాకు తెలుసు. ఏఐ డేటా సెంటర్ల భవనాలు కూడా చాలా విలువైనవి. అవి కూడా ఎంతోమందికి ఉపాధిని అందిస్తాయి' అని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
'ట్రంప్ వల్లే స్వర్ణయుగం'
ట్రంప్ లేకుంటే మేం ఈ ప్రాజెక్టు దిశగా అడుగులు వేసే అవకాశమే ఉండేది కాదని ఒరాకిల్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారి లారీ ఎలిసన్ అన్నారు. 'ఏఐ విప్లవం రావాలంటే డేటా సెంటర్ల ఏర్పాటు కీలకంఅని చెప్పారు. ఇది స్వర్ణ యుగానికి నాంది అని, ట్రంప్ వల్లే ఈ యుగం మొదలైందని సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ అన్నారు.' మేం వెంటనే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని స్టార్ గేట్ కంపెనీకి అందిస్తాం. రాబోయే నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు సమకూరుస్తాం. ఇది ఈ యుగంలోనే అతిపెద్ద ప్రాజెక్టు' అని వెల్లడించారు. ఈ యుగాన్ని మార్చబోయే ప్రాజెక్టులో మేం భాగమైనందుకు సంతోషంగా ఉందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.