Terror Attack In Russia: రష్యా రాజధాని మాస్కోలో సంగీత కచేరీలో జరిగిన ఉగ్రవాద దాడిలో60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 145 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
క్రాకస్ సిటీలోని శుక్రవారం ఓ హాలులో జరుగుతున్న సంగీత కచేరీలోకి ముష్కరులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తొలుత క్రాకస్ సిటీ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్న వారిపై కాల్పులు జరపడం సహా బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. అనంతరం సంగీత కార్యక్రమం జరుగుతున్న హాల్ లోపలికి వెళ్లి అక్కడ కూర్చున్న వారిపై కాల్పులకు దిగారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలతో అక్కడున్న వారు సీట్ల మధ్య దాక్కున్నారు. ఉగ్రవాదులు తొలుత పేలుళ్లకు, ఆ తర్వాత కాల్పలకు తెగబడ్డారని అధికారులు తెలిపారు.
కట్టుదిట్టమైన భద్రత
ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాయుధులు కాల్పులు జరపడం. ప్రజలు భయాందోళనలతో పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. పేలుళ్లకు క్రాకస్ సిటీ హాలు పైకప్పుకు మంటలు అంటుకొని దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాల్పుల ఘటన తర్వాత మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే మాస్కోలో ఈ వారంలో జరగాల్సిన పలు సమావేశాలను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
'దాడి చేసింది మేమే'
మరోవైపు ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తమ సామాజిక మాధ్యమాల్లోని అనుబంధ ఛానల్లో ఈ మేరకు పోస్టు చేసింది. ఈ ఘటనపై అమెరికా వైట్‌హౌజ్ స్పందించింది. ఘటన దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని ఆదేశ జాతీయ భద్రత సలహాదారు జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని తెలిపారు.