తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండున్నర దశాబ్దాల అసద్​ పాలనకు తెర - ఇక సిరియా దారెటు? - SYRIAN CIVIL WAR

సిరియా అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించింది హయాత్ తహరీర్ అల్​ షామ్​ - కుటుంబంతో సహా రష్యాకు చేరుకున్న అసద్

Syrian Crisis
Syrian Crisis (Associated press)

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2024, 7:12 AM IST

Syrian Crisis : వారం కిత్రం తిరుగుబాటుదారులు తమ స్థావరమైన ఇద్లిబ్‌ నుంచి అలెప్పో నగరం దిశగా పయనమైనపుడు సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ అధికారాన్ని కోల్పోతారని, రెండు వారాల్లోపే డమాస్కస్‌ హస్తగతమవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ దాదాపు రెండున్నర దశాబ్దాలు సిరియాను ఏలిన అసద్‌ అనూహ్యంగా దేశం విడిచి పారిపోయారు. ఆ దేశ చరిత్రలోనే ఇది కీలక మలుపు. అసద్‌ నిష్క్రమణతో మెజారిటీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో సిరియా భవిష్యత్తుపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అసద్​ కుటుంబంతో సహా అసద్​ రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

భౌగోళికంగా సిరియా కీలక ప్రాంతంలో ఉంది. ఆ దేశానికి ఏం జరిగినా, అది కేవలం పొరుగుదేశాలనే కాదు ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది. 2011 నుంచి కొనసాగిన 13 ఏళ్ల అంతర్యుద్ధమే ఇందుకు నిదర్శనం. అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియే ఇలా పలు దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే అసద్‌ ప్రభుత్వం పడిపోవడం వల్ల అంతా మారిపోతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. తిరుగుబాటుకు నేతృత్వం వహించింది హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌(హెచ్‌టీఎస్‌), సిరియా నేషనల్‌ ఆర్మీ(ఎస్‌ఎన్‌ఏ)లే అయినా, ఇంకా చాలా గ్రూపులు సిరియాలో ఉన్నాయి. ఇవన్నీ రానున్న రోజుల్లో ఏకతాటిపైకి వస్తేనే సిరియాలో శాంతి లేకుంటే రక్తపాతమే జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

కీలక పాత్ర హెచ్‌టీఎస్‌దే
తిరుగుబాటులో అబూ మహమ్మద్‌ అల్‌ జులానీ నేతృత్వంలోని హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌(హెచ్‌టీఎస్‌) కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సంస్థ ఎలా ప్రవర్తిస్తుందన్నదే ముఖ్యం. ఎందుకంటే సిరియాలో అనేక మైనారిటీ గ్రూపులు ఉన్నాయి. వీరందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. మరోవైపు హెచ్‌టీఎస్‌ గత చరిత్ర ఏమంత ఘనంగా లేదు. తాము అక్రమించిన ప్రాంతాల్లో ఇస్లామిక్‌ చట్టాలనే గతంలో అనుసరించింది. అమెరికా సహా అనే పశ్చిమ దేశాల ప్రభుత్వాలు హెచ్‌టీఎస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

ఇక అలెప్పీ, హమా, హోమ్స్, డమాస్కస్‌ నగరాలను హెచ్‌టీఎస్‌ చేజిక్కించుకున్నా దక్షిణ సిరియాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్థానిక తిరుగుబాటుదారులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సువైదా పట్టణాన్ని మైనారిటీ డ్రూజ్‌ తెగ ఆక్రమించింది. అంతర్యుద్ధంలో ఈ తెగ తటస్థంగా ఉన్నా, ఇటీవల కాలంలో అసద్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన దారా నగరాన్ని కూడా స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. మరి వీరందరితో డమాస్కస్‌లో పాలన చేపట్టే వర్గం ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది.

తేడా వస్తే రక్తపాతమే
తుర్కియే సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య కూడా రానున్న రోజుల్లో సిరియా ప్రశాంతంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనుంది. కుర్దులను ఎదుర్కోవడానికి ఉత్తర సిరియాలో తుర్కియే చాలా ఏళ్లుగా తన సైన్యాలను మోహరించింది. కుర్దు మిలిటెంట్లకు అమెరికా మద్దతిస్తోంది. సిరియాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ఐసిస్‌ నుంచి ముప్పుపొంచి ఉంది. వీరికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా తన దళాలను సిరియాలో మోహరించింది. ఇలా సిరియాలోని ప్రాంతాలను అనేక గ్రూపులు పంచుకున్నాయి. వీటన్నింటిని ఏకతాటిపైకి తీసుకురావడమే డమాస్కస్‌లో పాలనా పగ్గాలు చేపట్టేవారికి అతి పెద్ద సవాల్‌ కానుంది.

రష్యాకు చేరుకున్న అసద్
మరోవైపు దేశం విడిచి పారిపోయిన అసద్ కుటుంబంతో సహా రష్యాకు చేరికున్నట్లు అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి. అసద్​కు మానవతా సాయం కోణంలో రష్యా ఆశ్రయం కల్పించించిందని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.

సిరియాకు న్యాయం జరిగింది : బైడెన్
సిరియాకు ఇదో చారిత్రాత్మక అవకాశమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. 'అర్ధ శతాబ్దానికి పైగా బషర్‌ అసద్‌, అతడి తండ్రి సాగించిన క్రూర పాలన ముగిసింది. బషర్‌ అల్‌-అసద్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు ప్రాథమిక న్యాయం జరిగింది. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిరియా ప్రజలకు ఇదో చారిత్రాత్మక అవకాశం' అని జో బైడెన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details