Putin Kim Car Gift :ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు కారును కానుకగా పంపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు ఆ కారును పుతిన్ ఇచ్చినట్లు సమాచారం. ఇరువురి మధ్య మైత్రికి ప్రత్యేక గుర్తుగా రష్యాలో తయారైన ఈ కారును పుతిన్ పంపినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఈ కారును అందుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచదేశాల ఆంక్షలు ఉల్లంఘించి!
పుతిన్ పంపిన కారు ఏ రకానికి చెందినది, ఎలా దాన్ని తరలించారనే విషయాలపై స్పష్టత లేదు. అయితే, కొరియాకు లగ్జరీ వస్తువుల రవాణాపై ఆంక్షలు ఉన్నాయి. ఆ దేశం అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేయాలని ఐరాసలో తీర్మానం సైతం చేశారు. ఈ నేపథ్యంలో పుతిన్ ఈ వాహనాన్ని పంపించడం ప్రపంచ దేశాల ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
యుద్ధానికి కిమ్ సాయం!
కాగా, కొరియాతో పాటు రష్యాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఇరువురు మాస్కోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యాకు కిమ్ సహకరిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. రాకెట్లు, క్షిపణులు సహా అనేక రకాల ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, కొరియా మాత్రం వీటన్నింటిని ఖండించింది.