Natural Beauties of Nallamala : ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులకు మరో ఆహ్లదకరమైన పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మన్ననూరు జంగిల్ రిసార్ట్, టైగర్ స్టే ప్యాకేజికి (ఫర్హాబాద్ టూరిజం ప్యాకేజి)కి తోడు సోమవారం(జనవరి 13) నుంచి దోమలపెంటలో అక్కమహాదేవి స్టే ప్యాకేజీ(గుహలు) రారమ్మంటున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఇక్కడ సఫారీని ప్రారంభించారు.
ఆన్‌లైన్ బుకింగ్ : ఆసక్తిగల టూరిస్టులు www.amrabad tiger reserve.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి తమకు నచ్చిన రోజును ఎంపిక చేసుకోవచ్చు. పర్యాటకులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు దోమలపెంటలోని అటవీ శాఖ వనమయూరి గెస్ట్ హౌస్‌కు చేరుకోవాలి. 3 గంటలకు చెక్‌ఇన్ అయిన టూరిస్టులను 3.30 గంటలకు అక్టోపస్ దృశ్యకేంద్రానికి స్పెషల్‌గా వాహనంలో తీసుకెళ్లుతారు. అక్కడ కృష్ణానదిలోకి చొచ్చుకొచిన అక్టోపస్‌లాగా అడవి ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది.
జంతువులు, పక్షుల కనువిందు : అనంతరం వజ్రాల మడుగు కేంద్రానికి తీసుకెళాతారు. అక్కడి వాచ్ టవర్ పైనుంచి వంపులు తిరుగుతు వెల్లే వయ్యారాల కృష్ణానది అందాలను స్పష్టంగా వీక్షించొచ్చు. అక్కడి నుంచి రాత్రి విశ్రాంతి కోసం గెస్ట్ హౌస్‌కు తీసుకెళతారు. తరువాతి రోజు ఉదయం 6 గంటలకు శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న అక్కమహాదేవి గేట్ నుంచి సుమారు 5 కిలో మీటర్ల లోపల ఉన్న గుహలకు, దట్టమైన అడవి గుండా అక్కమహాదేవి గుహలోని ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. కాలి నడకన వెళ్లే సమయంలో పర్యాటకులను వివిధ రకాల యానిమల్స్, పక్షులు కనువిందు చేసే అవకాశాలు ఉన్నాయి.
పరమేశ్వరుడి దర్శనం : అనంతరం కొండ దిగువన కృష్ణానది ఒడ్డన ఉన్న అక్కమహదేవి గుహలకు చేరుకొంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ పెద్ద శిలాతోరణం, అక్కమహాదేవి తపస్సు చేసిన చిన్న గుహ, అందులోని ఆ పరమేశ్వరుడి శివలింగాన్ని దర్శించుకోచ్చు. గుహలో ప్రయాణం చాలా సాహసంతో కూడికొని ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి మద్యాహ్నం 12 గంటలకు మళ్లీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.
గంట తర్వాత చెక్ అవుట్ ఉంటుంది. ప్రయాణంలో ఓ గైడ్ టూరిస్టులకు తోడుగా ఉండి అడవిలో కనిపించే జంతువులు, పక్షులు, వృక్షాలు, అరుదైన మొక్కల గురించి క్లుప్తంగా వివరిస్తుంటాడు. ఈ నల్లమలలో ప్రయాణం మన జీవితంలో ఓ మధురానుభూతిగా మిగులుతుందని జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ గోపిడి ఈటీవీ భారత్‌కు తెలిపారు.
పర్యాటకులకు వసతి సౌకర్యాలు : అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్యాకేజీలో భాగంగా టూరిస్టులకు రాత్రి బస, భోజనం, ఉదయం టిఫిన్, ఆక్టోపస్ దృశ్యకేంద్రం, అక్కమహాదేవి గుహల గేటు, వజ్రాల మడుగు వద్దకు వెళ్లడానికి పటిష్ట భద్రతతో వాహన సౌకర్యం కల్పిస్తారు. పర్యాటకులు బస చేసేందుకు దోమలపెంటలో అటవీ శాఖకు చెందిన వనమయూరి గెస్ట్ హౌస్‌లో ఏర్పాట్లు చేస్తారు.
గదుల రకాన్ని బట్టి అద్దె వసూలు చేస్తున్నారు. పైఅంతస్తులోని 1వ గదికి రూ.7,500 లు, 2వ గదికి రూ.7,000 గ్రౌండ్ ఫ్లోర్‌లోని 3వ గదికి 7,000 4వ గదికి రూ.6,000 ల చొప్పున రెంట్ వసూలు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఉండటానికి అనుకూలంగా ఏసీ డబుల్ బెడ్‌రూం కాటేజీలు ఏర్పాటు చేశారు. 8 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్క వ్యక్తికి అదనంగా మరో రూ.1500లు అదనంగా ఛార్జీ వసూలు చేస్తారు.
అలా "సోమశిల" చూసొద్దామా - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ - పైగా శ్రీశైలం చూడొచ్చు!
ఒకే ట్రిప్‌లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!