Police Notices to BRS MLC P Srinivas Reddy : ఇటీవల హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. కోడి పందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ పోలీసులు మాదాపూర్‌లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలని పోలీసులు అందులో పేర్కొన్నారు.
కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ : ఫామ్‌హౌస్‌ను భూపతి రాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. లీజుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.30 లక్షల నగదు, జూదక్రీడలో ఉపయోగించే రూ.కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే : ఈ వ్యవహారంలో పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులిచ్చి విడిచిపెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి చెందిన 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాంహౌస్ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన వ్యాపారి భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్‌సింగ్‌కు లీజుకు ఇచ్చారని చెబుతున్నారు.
హైదరాబాద్‌లో సీక్రెట్‌గా కోడి పందేలు - పందెం రాయుళ్లకు పోలీసుల ఝలక్!