Vodafone Idea 5G Service Launch Date: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5G వినియోగానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఎట్టకేలకూ వొడాఫోన్-ఐడియా అంటే Vi కూడా భారత్‌లో తన 5G సర్వీస్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన జియో, ఎయిర్‌టెల్ తమ 5G సేవలను విస్తరించాయి. 2022లో మొదట ఎయిర్‌టెల్ తన 5G సర్వీస్‌ను ప్రారంభించగా, ఆ తర్వాత జియో కూడా లాంఛ్ చేసింది. కానీ వీఐ మాత్రం ఇంకా తన 5G సేవను ప్రారంభించలేదు.
ఇక మన దేశంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా మూడూ అతి పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు. వీటిలో మొదటి నుంచి నెలకొన్న త్రిముఖ పోరులో వొడాఫోన్ ఐడియా అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం దీని యూజర్ బేస్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్-ఐడియా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో జియో, ఎయిర్‌టెల్ తమ 5G సేవలను విస్తరించాయి.
దీంతో 5G రూపంలో వొడాఫోన్-ఐడియాకు గట్టి సవాలే ఎదురైందని చెప్పొచ్చు. 5G స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఈ సంస్థ నిధుల కొరత కారణంగా 5Gని విస్తరించడంలో ఆలస్యం చేసింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్ 5G సేవల్ని వేగంగా విస్తరించి మరింతమంది వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో వొడాఫోన్-ఐడియా పెద్దసంఖ్యలో యూజర్లను కోల్పోయింది. అయితే ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా వీఐ 5G సేవల్ని తీసుకొచ్చి తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
దేశంలో వీఐ 5G సర్వీసులు షురూ: వోడాఫోన్-ఐడియా తన లేటెస్ట్ ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో మార్చి 2025 నుంచి తన 5G సర్వీస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చిలో ముంబయిలో తొలిసారిగా తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే వీఐ ఈ సేవలు ప్రారంభించే తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ మొదట ముంబయిలో ఈ సేవలు ప్రారంభించిన తర్వాత ఏప్రిల్ 2025లో దిల్లీ, చండీగఢ్, బెంగళూరు, పాట్నా అనే మరో నాలుగు నగరాల్లో విస్తరించనున్నట్లు తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నివేదిక (Third Quarter Report)లో వొడాఫోన్ ఐడియా ఈ సమాచారాన్ని అందించింది. దీనిపై కంపెనీ సీఈవో అక్షయ్ ముంద్రా మాట్లాడుతూ "మేము ఇన్వెస్టిమెంట్ను పెంచుతున్నాము. నెక్స్ట్ క్వార్టర్లో పెట్టుబడి ఖర్చుల వేగం పెరుగుతుంది. ఇది కాకుండా కంపెనీ 5G సర్వీస్‌ను దశలవారీగా విస్తరిస్తుంది" అని అన్నారు.
4G సేవలపై కూడా నివేదిక: వోడాఫోన్- ఐడియా తన 5G సర్వీస్ రోల్ అవుట్‌ను ప్రకటించడమే కాకుండా గత తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా 4G సేవల విస్తరణపై నివేదికను కూడా సమర్పించింది. మార్చి 2024 నాటికి 4G సర్వీస్‌ను 1.03 బిలియన్ల జనాభాకు విస్తరించామని, డిసెంబర్ 2024 చివరి నాటికి ఈ సర్వీస్ 1.07 బిలియన్ వినియోగదారులకు చేరుకుందని కంపెనీ తెలిపింది.
ఇది కాకుండా ప్రతి యూజర్ సగటు ఆదాయం (ARPU)లో కూడా 4.7% పెరుగుదలను సాధించినట్లు Vi తన నివేదికలో పేర్కొంది. కంపెనీ ప్రకారం వారి ARPU క్వార్టర్-2లో రూ.166గా ఉంది. ఇది క్వార్టర్-3లో రూ.173కి పెరిగింది.
ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో మీ జేబుకు చిల్లు పడుతోందా?- అయితే ఈ చౌకైన ప్యాక్‌లపై ఓ లుక్కేయండి!
క్రూ-10 మిషన్‌లో కీలక మార్పులు!- షెడ్యూల్ కంటే ముందుగానే భూమికి సునీతా?
హై మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటీ లాంఛ్- ధర తక్కువ ఫీచర్స్ ఎక్కువ!