BRICS Summit 2024 PM Modi : భారత్ చర్చలు, దౌత్యానికే మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుత చర్చలతో పరిష్కరించుకోవాలని అన్నారు. రష్యాలోని కాజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమిట్ రెండోరోజు ప్లీనరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్లడానికి బ్రిక్స్ సానుకూల పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
'మనమంతా కలిసి కొవిడ్ లాంటి సవాళ్లను అధిగమించాం. అదే విధంగా భవిష్యత్ తరాల కోసం సురక్షిత, భద్రపరమైన జీవితాన్ని అందించేందుకు కచ్చితంగా కొత్త అవకాశాలను సృష్టించగలం. సైబర్ భద్రత, సురక్షితమైన ఏఐ కోసం అంతర్జాతీయ నిబంధనలను తీసుకొచ్చేందుకు అందరం కలిసి కృషి చేయాలి. ఉగ్రవాదానికి, తీవ్రవాదులకు నిధులు సమకూర్చడానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ విధానాలకు తావులేదు. మన దేశాల్లోని యువతను అతివాదభావజాలం వైపు మరల్చే చర్యలను అడ్డుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలి' అని ప్రధాని మోదీ సూచించారు.