Modi Indian Community Event :అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి వీలుగా, తమ మూడో విడత పాలనలో మరింత సమున్నత లక్ష్యాలతో పని చేస్తున్నామని, ఇందుకోసం మూడింతల బలంతో ముందుకు సాగుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం ఒక అవకాశాల స్వర్గమని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలోసియమ్లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ప్రధాని మాట్లాడారు. ఈ సదస్సుకు దాదాపు 13 వేల మంది హాజరయ్యారు. 'అత్యంత సంక్లిష్టమైన, సుదీర్ఘమైన ఎన్నికల ప్రక్రియను దాటి ముందుకొచ్చాం. అబ్ కీ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం) వచ్చింది. 60 ఏళ్ల (కాంగ్రెస్ పాలన) తర్వాత భారత ప్రజలు ఇచ్చిన ఈ తీర్పునకు అత్యంత ప్రాధాన్యముంది; అని మోదీ పేర్కొన్నారు.
సుపరిపాలనకు అంకితం
సుసంపన్న భారత్ సాధన కోసం, సుపరిపాలన కోసం తన జీవితాన్ని అంకితం ఇచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. విధి తనను రాజకీయాలవైపు నడిపించిందని, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అవుతానని తాను ఏనాడూ అనుకోలేదని చెప్పారు. గత పదేళ్లలో తన సుపరిపాలనను చూసిన ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని వెల్లడించారు. సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ, త్యాగాలు చేసేవారే ఫలాలను పొందుతారని పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక, దేశాభివృద్ధికి దోహదపడతారని అన్నారు. దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్రను మోదీ ప్రత్యేకంగా కొనియాడారు.
140 కోట్ల మందికి దక్కిన గౌరవం
'డెలావేర్‌లోని తన నివాసానికి బైడెన్ నన్ను తీసుకెళ్లారు. ఆయన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని స్పృశించింది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం. మీ విజయాల వల్లే ఈ గౌరవం సాధ్యమైంది (ప్రవాస భారతీయులను ఉద్దేశించి). అమెరికాలో నివసిస్తున్న వేల మంది ప్రవాస భారతీయులే, భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు. భారత్, అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండగలో భాగస్వాములయ్యాయి.
- ఏఐ అంటే ప్రపంచానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఏఐ అంటే అమెరికా, ఇండియా స్ఫూర్తి అని నా నమ్మకం.
- ప్రవాస భారతీయులు అందరికీ శాల్యూట్ చేస్తున్నా. మీరు భారత్, అమెరికాలను అనుసంధానం చేస్తున్నారు. మీ నైపుణ్యం, ప్రతిభ, నిబద్ధత అసమానం.
- భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. అది మన రక్తం, మన సంస్కృతిలోనే ఉంది.
- 2036లో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించాలనే గట్టి లక్ష్యంతో పని చేస్తున్నాం.
- కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలే అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపిస్తున్నాయి అని మోదీ అన్నారు.