Pakistan Elections Army :పాకిస్థాన్ రాజకీయాలను అక్కడి సైన్యం శాసిస్తుందనే విషయం మరోసారి బహిర్గతమైంది. ప్రధానమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టి రికార్డ్ సృష్టించాలని కలలుగన్న నవాజ్ షరీఫ్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో ప్రధాని పదవికి తన సోదరుడు, మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనక సైన్యం ఒత్తిడి ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 8న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో PML(N) పార్టీ మెజార్టీ సాధించలేని నేపథ్యంలో నవాజ్ షరీఫ్‌కు సైన్యం రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు సమాచారం. ప్రధాని పదవి కావాలా లేక కుమార్తె మరియంకు పంజాబ్ సీఎం పగ్గాలు కావాలో తేల్చుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
అయితే తన కుమార్తె, రాజకీయ వారసురాలు మరియం కోసం నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిని త్యాగం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పాకిస్థాన్ మిలిటరీకి షెహబాజ్ షరీఫ్ ఇష్టమైన వ్యక్తి కావటం వల్ల చివరి నిమిషంలో నవాజ్ షరీఫ్‌ను పక్కనపెట్టినట్లు సమాచారం.
పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు మరోసారి బయటపడింది. ఎన్నికల్లో అక్రమాల వల్లే తాము గెలిచామంటూ రెండు స్థానాలను మూడు పార్టీలు వదులుకోగా తాజాగా ఎన్నికల్లో అక్రమాలు నిజమేనని ఓ బ్యూరోక్రాట్ ప్రకటించారు. నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల అక్రమాల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్, చీఫ్ జస్టిస్‌కు ప్రమేయం ఉందని రావల్పిండి మాజీ ఎన్నికల కమిషనర్ లియాఖత్ అలీ చత్తా ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించారు.