India Canada Relations :కెనడా చర్యలను తీవ్రంగా పరిగణిస్తోన్న భారత్ అదే స్థాయిలో స్పందిస్తోంది. ఇప్పటికే కెనడాలోని భారత దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని నిర్ణయించిన భారత్.. మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలపైనా వేటు వేసింది. అక్టోబర్ 19 అర్ధరాత్రి 12 గంటల్లోపు ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు భారత్ విడిచి వెళ్లిపోవాలని సూచించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో ఇటీవల భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లుగా (అనుమానితులుగా) కెనడా పేర్కొనడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో కెనడాలోని హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పించాలని నిర్ణయించింది. తమ దౌత్యవేత్తలకు భద్రత కల్పించే విషయంలో ట్రూడో సర్కారుపై తమకు విశ్వాసం లేదని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అక్కడి భారత రాయబారుల భద్రతపై అనుమానాలున్నాయని తెలిపింది.
ఈ వ్యవహారంపై అంతకుముందు కెనడా దౌత్యవేత్తకు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే భారత హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని సదరు దౌత్యాధికారికి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు ట్రూడో ప్రభుత్వం ఇస్తున్న మద్దతుకు ప్రతిస్పందనగా తగిన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని పేర్కొంది.
2023 జులై 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజ్జర్ హత్య జరిగింది. అయితే, ఈ హత్యలో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కెనడాలో వైరల్‌గా మారాయి. అయితే భారత్‌కు చెందిన ముగ్గురు నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులకు పాక్‌లోని ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు భారత వర్గాలు అనుమానిస్తున్నాయి.