Las Vegas Trump Hotel Explosion : అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఓ ప్రమాదం జరిగింది. ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. అయితే కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చు
మరోవైపు తాజాగా న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన ఘటనకు ఈ ప్రమాదానికి మధ్య సంబంధం ఉందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. "ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్యగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలకు కారణమైన రెండు కార్లను దుండగులు టూర్ రెంటల్ అనే వెబ్‌సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారు. బహుశా ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చు" అని ఎక్స్ వేదికగా మస్క్ పేర్కొన్నారు.
లాస్ వెగాస్‌లో జరిగిన ప్రమాదం పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని, అయితే టెస్లా వాహనం వల్ల కాదంటూ మస్క్ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా దీనిపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
అమెరికాలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది: ట్రంప్
Donald Trump On New Orleans Car Incident : మరోవైపు న్యూ ఆర్లీన్స్ ఘటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. "మన దేశంలో వలసల కారణంగా వస్తున్న నేరస్థుల సంఖ్య అధికంగా ఉందని మేము ముందు నుంచే హెచ్చరించాం. నా మాటలను డెమోక్రాట్లు, మీడియా అప్పట్లో ఖండించాయి. నేను చెప్పింది నిజమేనని ఇప్పుడు జరిగిన ఘటన చెబుతోంది. గతంలో కంటే అమెరికాలో ఇప్పుడు క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ప్రమాదంలో మృతి చెందినవారికి నేను సంతాపం తెలియచేస్తున్నాను. గాయాలపాలైనవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని ట్రంప్ పేర్కొన్నారు.
న్యూఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి! జనంపైకి దూసుకెళ్లిన కారు- 15 మంది మృతి
అమెరికా ట్రెజరీపై సైబర్ ఎటాక్ - బరితెగించిన చైనా హ్యాకర్స్!