- 2013లో బీజేపీకి 35 సీట్లు, ఆప్‌నకు 17 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా
- అంచనాలకు మించి 28 సీట్లు గెలుచుకున్న ఆప్
- 2015లో ఆప్‌నకు జస్ట్ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం
- 70కి 67 స్థానాలు గెలిచి ప్రభంజనం
- 2020లోనూ ఎగ్జిట్ పోల్స్‌ను తారుమారు చేసి ఆప్ 62సీట్లు కైవసం
- 2025లో బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
- ఈసారి అంచనాలకు వ్యతిరేకంగా ఆప్ విజయ దుందుభి మోగిస్తుందా?
ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్ ఆవిర్భావం నుంచి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి వ్యక్తిరేకంగా వచ్చాయి. 2013లో బీజేపీకి 35 సీట్లు, ఆప్‌నకు 17 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఆప్ వాటిని తారుమారు చేస్తూ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 32 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లకు పరిమితమైంది. 2015లో ఆప్‌నకు 35-53 వరకు సీట్లు వస్తాయని, బీజేపీకి దాదాపు 25 సీట్ల వరకు రావొచ్చని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక 2020లో ఆప్ దాదాపు 54 సీట్లు, బీజేపీ 15 సీట్ల వరకు గెలుస్తుందని చెప్పాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తప్పాయి. 2015లో 70 అసెంబ్లీ స్థానాలకుగానూ ఆప్ ఏకంగా 67 నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించింది. 2020లోనూ 62 సీట్లు సాధించింది ఆప్. తప్పుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో దిల్లీలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గతంలో లాగా ఎగ్జిట్ పోల్స్ తప్పితే కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొడతారు. దిల్లీలో పట్టు సాధించి పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్, జాతీయ పార్టీగా ఆవిర్భవించి ఒకానొక సమయంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందా అనే భావన కలిగించింది. అయితే అవినీతి వ్యతిరేక పోరాటంలో పుట్టుకొచ్చిన ఆప్‌పై, అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. కేజ్రీవాల్ సహా పలువురు పార్టీ అగ్రనేతలు అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ఈ పరిణామాలతో ఆప్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దిల్లీలో కాలుష్యంపైనా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది ఆప్. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆప్‌నకు వ్యతిరేకంగా వెలువడ్డాయి. ఒకవేళ వీటన్నింటినీ దాటుకుని ఆప్ గెలిస్తే ఆప్‌నకు తిరుగుండదు. మరోసారి చరిత్ర సృష్టించినట్టే అవుతుంది.
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
దిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. 60.42 శాతం ఓటింగ్ నమోదైంది. క్రితం ఎన్నికల కంటే ఇది 1.56 శాతం తక్కువ. కాగా, ఈసారి 'దిల్లీ దిల్'ను ఎవరు గెలుస్తారో ఓట్ల లెక్కింపు రోజు ఫిబ్రవరి 8న(శనివారం) తేలనుంది. ఓట్ల లెక్కింపు జరిగే 19 కౌంటింగ్ కేంద్రాల్లో రెండు పారా మిలిటరీ బలగాలు, దిల్లీ పోలీసులతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల లోపలికి గుర్తింపు కలిగిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని స్పెషల్ సీపీ దేవేశ్ చంద్ర తెలిపారు. లెక్కింపు కేంద్రం ప్రాంతంలో సెల్‌ఫోన్ వాడకాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. కౌంటింగ్ సమయంలో రాకపోకలు సజావుగా జరిగేలా ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.