6G Race China Vs Starlink : శరవేగంగా డేటాను ట్రాన్స్‌మిట్ చేయడంలో చైనా దూసుకెళ్తోంది. తాజాగా 6జీ రేసులో మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ను వెనక్కి తోసినట్లు ప్రకటించింది. ఆ దేశానికి చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబిట్స్ డేటాను ట్రాన్స్‌మిట్ చేసేలా అత్యాధునిక హైరిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్‌పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్‌కు ఈ డేటాను పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ప్రయాణించింది.
స్టార్‌లింక్ 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందన్నది అధికారికం కాదని చైనా సంస్థకు చెందిన లేజర్ గ్రౌండ్ కమ్యూనికేషన్స్ అధిపతి వాంగ్ హాంగ్‌హాంగ్ పేర్కొన్నారు. 'మా టెక్నాలజీ మస్క్‌కు చెందిన కంపెనీని ఈ విషయంలో వెనక్కి నెట్టింది. చేసిందన్నారు. మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది. కానీ, దానిని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్‌కు ఇప్పటి వరకు ఉపయోగించలేదు. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు. కానీ, మేము ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టాం' అని వెల్లడించారు.
అయితే ఈ కంపెనీ జిలిన్-1 శ్రేణిలోని ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తి కక్ష్యలోకి చేర్చనుంది. 100 జీబీపీఎస్ డేటా 10 పూర్తిస్థాయిలో సినిమాల సైజులో ఉంటుంది. దీనిని చైనా సంస్థ ఒక్క సెకన్‌లో ట్రాన్స్‌మిట్ చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్స్ సంస్థ కూడా 100 జీబీపీఎస్ ట్రాన్స్‌మిట్ చేసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5జీ కమ్యూనికేషన్స్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వెర్షన్ 6జీగా ఉంది. దీనిని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5జీ ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణలో కూడా మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో 10,000 మందికి అత్యంత సురక్షితంగా, వేగవంతంగానూ డేటాను పంపిస్తుంది. దీనిని చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.