తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘర్షణల నివారణకు మీ కృషి భేష్‌ - మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు బైడెన్‌ కితాబు - Biden Hails PM Modi Ukraine Trip - BIDEN HAILS PM MODI UKRAINE TRIP

Joe Biden Hails PM Modi's Ukraine Trip : రష్యా-ఉక్రెయిన్‌ ఘర్షణలతో సహా ప్రపంచవ్యాప్త సవాళ్లకు పరిష్కారం సాధించే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొనియాడారు.

Joe Biden hails PM Modi
Joe Biden hails PM Modi (AP)

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2024, 6:50 AM IST

Joe Biden Hails PM Modi's Ukraine Trip :రష్యా- ఉక్రెయిన్‌ ఘర్షణలతో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు రాజకీయ సవాళ్లకు పరిష్కారం సాధించే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపిస్తున్న చొరవను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొనియాడారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించి, అందులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం కోసం అమెరికా సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ఐరాస లాంటి సంస్థల్లో ఇండియా అభిప్రాయం ప్రతిఫలించేలా మార్పులు చేసేందుకు అమెరికా అండగా నిలుస్తుందని ప్రకటించారు. యూఎస్​ పర్యటనకు వచ్చిన మోదీకి విల్మింగ్టన్‌లోని తన వ్యక్తిగత నివాసంలో బైడెన్​ ఆతిథ్యం ఇచ్చారు.

మోదీ-బైడెన్​లు జరిపిన చర్చల సారాంశాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ విలేకరులకు వెల్లడించారు. ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు చల్లార్చడం సహా, అనేక ముఖ్యమైన అంశాలపై వేర్వేరు వ్యక్తులతో భారత్‌ సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి శాంతియుత పరిష్కారం వైపే భారత్‌ నిలుస్తోందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సంక్షోభాన్ని కొలిక్కి తీసుకువచ్చేందుకు వ్యక్తిగతంగానూ తగినంత కృషి చేసేందుకు సిద్ధమని చెప్పారు. మరోవైపు భారత్​-అమెరికాలు సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ప్రతినబూనారు.

భారత్‌ చొరవపై ప్రశంసల జల్లు
మోదీ-బైడెన్​లు ప్రధానంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులు, చైనా ఆధిపత్య యత్నాలు వంటివీ వారి ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చాయని ఈ భేటీ అనంతరం విడుదలైన వాస్తవాల పత్రం (ఫ్యాక్ట్‌షీట్‌) వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రపంచ వేదికలపై భారత్‌ చొరవపై బైడెన్‌ అత్యంత సంతృప్తితో అభినందనలు తెలిపారని పేర్కొంది. జీ-20, క్వాడ్‌ లాంటి కూటముల ద్వారా సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కోసం ఎలాంటి దాపరికంలేని రీతిలో భారత్‌ పోషిస్తున్న పాత్రను బైడెన్​ కొనియాడారు. పోలాండ్​, ఉక్రెయిన్‌లలో మోదీ పర్యటించి శాంతి సందేశం ఇవ్వడాన్ని, ఉక్రెయిన్‌కు మానవతాసాయం అందించడాన్ని బైడెన్‌ పలుమార్లు కొనియాడారని తెలిపింది. మాస్కో, కీవ్‌లలో చేసిన పర్యటనల గురించి బైడెన్​కు మోదీ వివరించినట్లు సమాచారం.

ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ ఏమైనా శాంతి ప్రతిపాదన చేసిందా? అనే ప్రశ్నకు మిస్రీ సమాధానమిస్తూ- అనేక రకాల మధ్యవర్తులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ల తయారీ విభాగం ఏర్పాటు, దేశ భద్రత, నెక్ట్స్​ జనరేషన్​ టెలికమ్యూనికేషన్స్​, హరిత ఇంధన అనువర్తనాలపైనా మోదీ, బైడెన్‌ చర్చించుకున్నారు. ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీకి చెన్నైలో ఉన్న కర్మాగారాన్ని విదేశీ ఎగుమతులకు వినియోగించుకోవడం సహా పలు అంశాలను నేతలిద్దరూ ఆహ్వానించారు. అమెరికా నుంచి 30 ఎంక్యూ-9బి డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేసే విషయంలోనూ సానుకూల అడుగులు పడుతున్నాయని బైడెన్‌ తెలిపారు. త్వరలో పదవీకాలం ముగియబోతున్న బైడెన్‌తో ఇదే చివరి సమావేశం కావడంతో, కొంత భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై పోరుకు 75 లక్షల డాలర్లు అందజేసేందుకు మోదీ హామీ ఇచ్చారు.

మన భాగస్వామ్య బంధం బలమైనది
"భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఎంతో బలమైనది, సన్నిహితమైనది. చరిత్రలో ఎన్నడూలేనంత గతిశీలమైనది కూడా. నేను, మోదీ ఎప్పుడు కలిసి కూర్చొన్నా సరికొత్త రంగాల్లో సహకారానికి ప్రయత్నిస్తుంటాం. ఈరోజు కూడా అదే జరిగింది" అని మోదీతో గంటసేపు చర్చల అనంతరం ‘ఎక్స్‌’లో జో బైడెన్‌ పోస్ట్​ పెట్టారు.

"పరస్పర ప్రయోజనకర అంశాల్లో భాగస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకునే దిశగా చర్చలు ఎంతో ఫలప్రదంగా సాగాయి. నాకు చక్కని ఆతిథ్యం లభించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో పాటు ప్రపంచ దేశాల సంబంధిత విషయాలపైనా ఇరువురం అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నాం" అని బైడెన్‌తో భేటీపై ‘ఎక్స్‌’లో మోదీ పోస్ట్​ పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details