Piracy Secured Board To Stop Pirated Movies In Theaters : థియేటర్లలో కొత్త మూవీ విడుదలైతే చాలు, వెంటనే వేరు వేరు వెబ్‌సైట్లలో ప్రత్యక్షం అవుతోంది. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న మూవీస్‌ను కొందరు రికార్డు చేసి వెబ్‌సైట్లలో ఉంచుతున్నారు. ఈ పైరసీని నిలువరించేందుకు సినీ నిర్మాతలు చేస్తున్న యత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. సినిమా పైరసీని అడ్డుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన పి.వినోద్ కుమార్ అనే వ్యక్తి 'పైరసీ సెక్యూర్డ్ బోర్డు'ను తయారు చేశారు. దీనికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా పేటెంట్ మంజూరు చేసింది.
ఏడు సంవత్సరాల తర్వాత పేటెంట్ : అమెరికాలోని ఫాక్స్ స్టూడియోస్ మూవీ పైరసీని నియంత్రణ చేసేందుకు గతంలో ‘వాటర్ మార్క్ టెక్నాలజీ’ని రూపొందించింది. థియేటర్‌లో మూవీ ప్రదర్శన జరుగుతున్నప్పుడు కొన్ని క్షణాల పాటు ఒక నంబర్ వచ్చి వెళ్తుంది. దీనిని వాటర్ మార్క్ టెక్నాలజీ అంటారు. పైరసీ కాపీలో నమోదు అయ్యే ఆ నంబర్ ఆధారంగా సినిమాని ఎక్కడ, ఎలా, ఏ రోజు, ఏ షోలో రికార్డు చేశారో గుర్తించవచ్చు. అయితే ఇలా గుర్తించడం మినహా నియంత్రించడం సాధ్యం కావడం లేదు.
ఈ విషయం తెలుసుకున్న పి.వినోద్ కుమార్ పైరసీని నియంత్రించేందుకు పరిశోధనలు చేశారు. 2016 సంవత్సరంలో 'పైరసీ సెక్యూర్డ్ బోర్డు'ను రూపొందించారు. దీన్ని తెర వెనుక అమరిస్తే అందులో నుంచి వచ్చే ఐఆర్ (ఇన్‌ఫ్రా రెడ్) కిరణాల కారణంగా వీడియో తీసినా రికార్డు అవదు. దీనిపై అదే సంవత్సరం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియాకు పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. అమెరికా, జపాన్ల నుంచి ఇదే తరహా సాంకేతికతతో తయారైన ప్రొటోటైప్‌లు ఉండటంతో పేటెంట్ లభించలేదు. ఏడు సంవత్సరాల తర్వాత పేటెంట్ లభించింది.
నేపథ్యం : ఏపీలోని అనకాపల్లికి చెందిన వినోద్ కుమార్ పదో తరగతి నుంచే వెబ్ డెవలప్‌మెంట్ కోర్సులను నేర్చుకొన్నారు. ఎంబీఏ, ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అనంతరం జీవిత బీమా కంపెనీల్లో జాబ్ చేశారు. 2018లో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తూనే బధిరులకు తేలిగ్గా సమాచారం అందించే 'కమ్యూనికేషన్' పరికరాన్ని రూపొందించగా పేటెంట్ దక్కింది. ఇప్పుడు పైరసీ సెక్యూర్డ్ బోర్డుపై తనకు 20 సంవత్సరాల గడువుతో పేటెంట్ దక్కిందని వినోద్ కుమార్ వివరించారు.