SUPREME COURT On Mohan Babu Case : సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మోహన్‌బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
ఇదీ జరిగింది : మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలోనే మోహన్‌బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటులోపల ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ మీడియా ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కొద్దిరోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
'గతం గతః- నిన్న జరిగింది మర్చిపోవాలి'- మోహన్ బాబు
హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు - ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు