Israel Hezbollah Ceasefire :హెజ్బొల్లా- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో ఆ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇటీవలే హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరామం కోసం అమెరికా, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో 21 రోజుల కాల్పుల విరమణ ఇవ్వాలని పిలుపునిచ్చాయి.
'ఈ దాడులు చాలా ప్రమాదకరం'
అలాగే కాల్పుల విరమణపై చర్చలు జరపాలని ఇరు దేశాలను యూఎస్, ఫ్రాన్స్ సహా ఆస్ట్రేలియా, కెనడా, ఈయూ, జర్మనీ, ఇటలీ, జపాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దేశాలు కోరాయి. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఈ దాడులు చాలా ప్రమాదకరమని హెచ్చరించాయి. ఇజ్రాయెల్- హెజ్బొల్లా సరిహద్దుల్లో తక్షణమే కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి.
'ఇరుదేశాల సరిహద్దుల్లో మాత్రమే'
తమ మిత్రదేశాలన్నీ హెజ్బొల్లా- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే లెబనాన్, ఇజ్రాయెల్‌తో సంధిపై చర్చిస్తామని వెల్లడించారు. కాల్పుల విరమణపై హెజ్బొల్లా సంతకం చేయదని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై లెబనాన్ ప్రభుత్వంతో మాట్లాడుతామని చెప్పుకొచ్చారు. ఈ కాల్పుల విరమణ పిలుపు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు
అలాగే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణపై కూడా యూఎస్ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం ఆగిపోయిన నేపథ్యంలో అక్కడ కూడా మూడు వారాల కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కాగా, యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్‌తో అధ్యక్షుడు జో బైడెన్ హెజ్బొల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణపై చర్చించారని పేర్కొన్నారు. అలాగే బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మధ్య కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని తెలిపారు. కాల్పుల విరమణ అంశంపై ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.