తెలంగాణ

telangana

ETV Bharat / international

ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్- ప్రయోగం ఎప్పుడంటే? - sunita williams journey to space - SUNITA WILLIAMS JOURNEY TO SPACE

Sunita Williams Journey To Space : భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బచ్‌ విల్‌మోర్​తో కలిసి సునీతా విలిమయ్స్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలో మే 7న(మంగళవారం) స్పేస్​లోకి దూసుకెళ్లనున్నారు. ఇప్పటికే రెండు సార్లు అంతరిక్షయానం చేసిన సునీతాకు ఇది మూడో రోదసి యాత్ర.

Sunita Williams Journey To Space
Sunita Williams Journey To Space (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 5:58 PM IST

Sunita Williams Journey To Space :భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలో సునీతా విలిమయ్స్ మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్​తో కలిసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7న(మంగళవారం) ఉదయం 8గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడాలో స్పేస్ లాంఛ్ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. కాగా, తాము రోదసి యాత్రకు సిద్ధంగా ఉన్నామని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు.

నాసా తన కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌ క్రాఫ్ట్‌ ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్​తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌ మోర్‌ అంతరిక్షయానం చేయనున్నారు. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి, ఐఎస్‌ఎస్‌కు చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఇలా ఈ ప్రయోగం ద్వారా స్పేస్‌ క్రాఫ్ట్‌ శక్తిసామర్థ్యాల్ని నాసా పరిశీలించనుంది. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలాన్ మస్క్​కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది. కాగా, స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక రూపకల్పనలో అవాంతరాలు ఎదురుకావడం వల్ల చాలా ఏళ్ల నుంచి ఈ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. 'స్టార్ లైనర్ వ్యోమనౌకను మానవ సహిత అంతరిక్ష వాహన నౌకగా డిజైన్ చేయడానికి చాలా కష్టపడ్డాం. అనేక సమస్యలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు గర్వపడుతున్నాం.' అని స్టార్ లైనర్ ప్రోగ్రామ్ మేనేజర్ మార్క్ నొప్పి చెప్పుకొచ్చారు.

సునీతా విలియమ్స్ వ్యక్తిగత వివరాలు
భారతీయ అమెరికన్ దీపక్ పాండ్య, స్లొవేనియాకు చెందిన ఉర్సులిన్ బోనీ దంపతులకు సునీతా విలియమ్స్ అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు. రోదసిపై మక్కువతో 1998లో అంతరిక్షయానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్‌ నుంచి 2007 జూన్‌ వరకు సుమారు 7 నెలల పాటు ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం’లో గడిపారు. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్‌ఎస్‌ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌ వాక్‌ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో 4 నెలల పాటు ఐఎస్‌ఎస్‌ లోనే గడిపిన ఆమె, అక్కడి ఆర్బిటింగ్‌ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె, మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌ వాక్‌ చేసి, ఎక్కువ సమయం స్పేస్‌ వాక్‌ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా రెండు స్పేస్ షటిల్స్​తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. తాజాగా మే 7న మూడోసారి అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు సునీతా విలియమ్స్.

Spacex Crew Return To Earth : ఆరు నెలల తర్వాత భూమిపైకి.. అంతరిక్షం నుంచి అట్లాంటిక్​లో ల్యాండింగ్

200 రోజుల తర్వాత స్పేస్​ నుంచి భూమికి వ్యోమగాములు

ABOUT THE AUTHOR

...view details