Houthis Damaged Undersea Cables :ఇప్పటివరకు ఎర్రసముద్రంలో రాకపోకలు సాగించే రవాణా నౌకలపై దాడి చేసిన హౌతీ రెబల్స్, ఇప్పుడు ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలకు జీవనాడి వంటి సముద్రగర్భ కేబుల్స్‌పై దాడులు మొదలుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా భారత్-బ్రిటన్ మధ్య ఉన్న కీలక కమ్యూనికేషన్ లైన్ సహా నాలుగు కేబుల్స్‌పై దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో భారత్-ఐరోపా మధ్య సేవలు అందించేవే అధికంగా ఉన్నట్లు నిపుణలు భావిస్తున్నారు. యెమన్ తీర జలాల అడుగు నుంచి పరిచిన నాలుగు కమ్యూనికేషన్ కేబుల్స్ ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వీటిల్లో ఒక కేబుల్ నిర్వహించే సంస్థ ఇప్పటికే ఈ అంశాన్ని ధ్రువీకరించింది.
దెబ్బతిన్న కేబుల్స్ ఇవే
మొత్తం నాలుగు సముద్రగర్భ కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నట్లు జెరూసలెంపోస్ట్, గ్లోబెక్స్ కథనాలు వెల్లడించాయి. అంతేకాకుండా డేటాసెంటర్ డైనమిక్స్ కూడా ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
- ఏఏఈ-1 కేబుల్
(Asia-Africa-Europe 1 (AAE-1) :ఇది తూర్పు ఆసియాను ఈజిప్ట్ మీదుగా ఐరోపాతో అనుసంధానిస్తుంది. అంతేకాదు చైనాను ఖతర్, పాకిస్థాన్ మీదుగా పశ్చిమ దేశాలతో కలుపుతుంది. - యూరప్ ఇండియా గేట్‌వే (ఈఐజీ) కేబుల్
Europe India Gateway Cable System :దక్షిణ ఐరోపా ప్రాంతం మీదుగా ఈజిప్ట్, సౌదీ, జిబూటి, యూఏఈ, భారత్‌కు కమ్యూనికేషన్ సేవలు అందిస్తుంది . - సీకామ్ కేబుల్
seacom cable system : ఐరోపా, ఆఫ్రికా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలను అనుసంధానిస్తుంది. సీకామ్-టాటా కమ్యూనికేషన్స్ కలిసి పనిచేస్తాయి. - టీజీఎన్-ఈఏ కేబుల్ :TGN-Eurasia/ TGN-EA : ఇది 9,280 కిలో మీటర్ల పొడవైన అండసీ కేబుల్ సిస్టమ్. ఇది భారత్‌లోని ముంబయిని ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌తో కలుపుతూ, ఈజిప్ట్ గుండా వెళుతుంది. బ్రాంచ్ యూనిట్‌తో సౌదీ అరేబియా, జెడ్డాకు కూడా వెళుతుంది.
గతంలోనే హెచ్చరికలు
అయితే ఇలాంటి దాడుల గురించి ఇప్పటికే హౌతీలు హెచ్చరించారు. ఎర్రసముద్రంలోని బాబ్-ఎల్-మండెప్ వద్ద నుంచి వెళ్లే సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హౌతీలు హెచ్చరికలు చేశారు. ఈ మేరకు వారు టెలిగ్రామ్‌లో సందేశాలు ఇచ్చారు. అంతేకాకుండా కొన్ని అండర్‌సీ కేబుల్స్ చిత్రాలను కూడా పోస్టు చేశారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలకు అంతరాయం కలుగుతుందని చెప్పారు.
ప్రపంచలోని ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 17శాతానికి సంబంధించిన కేబుల్స్ ఈజిప్ట్‌లోని సూయజ్, బాబ్-ఎల్-మండెప్ జలసంధుల మీదుగా ఐరోపా-ఆసియా ప్రాంతాలను కలుపుతున్నాయి. ముఖ్యంగా గేట్ ఆఫ్ టియర్స్‌గా పేరున్న యెమెన్-జిబూటీ, ఎరిత్రియా మధ్య సముద్రం వెడల్పు కేవలం దాదాపు 32 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కొన్ని వందల మీటర్ల లోతులో ఈ తీగలను పరిచారు. అయితే సాధారణ డైవర్లు ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అమెరికా, రష్యా నౌకాదళాలకు మాత్రమే వీటిని కత్తిరించే సామర్థ్యం ఉంది. ప్రత్యేకమైన పరికరాలు, వాహనాలను దీనికోసం వాడాల్సి ఉంటుంది. హౌతీలు డైవర్లు, నౌకలకు వాడే మైన్లను వినియోగించి వీటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.