Heavy Rainfalls In Dubai : ఎడారి దేశమైన యూఏఈలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి దుబాయ్‌లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి. దుబాయ్ సంవత్సర సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లు. ఇప్పుడు కేవలం ఆరు గంటల్లోనే 50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్రభుత్వం సహాయక చర్యలు కూడా చేపట్టింది. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
పలు విమానాల సర్వీసులు రద్దు
భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు అయినట్లు సమాచారం. ప్రజలు బీచ్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాల్లో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
'ఇళ్లు వదిలి బయటకు రావొద్దు'
మరోవైపు నివాసితులకు ఎట్టి పరిస్థితుల్లోను ఇళ్లు వదిలి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిలోని కొన్ని మార్గాలను దుబాయ్ అధికారులు మూసేశారు. దుబాయ్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.