Gunmen Kills Bus Passengers In Pakistan :పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సాయుధులు మరోసారి రెచ్చిపోయారు. రెండు ఘటనల్లో బస్సులో ప్రయాణిస్తున్న 33 మందిని సాయుధులు కిందకు దింపి మరీ కాల్చి చంపారు. తర్వాత 12 వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. అనంతరం పర్వత భూభాగంలోకి సాయుధులు పారిపోయారు. ఈ దారుణ ఘటన బలూచిస్థాన్‌లోని ముసాఖేల్ జిల్లాలో సోమవారం జరిగింది.
అసలేం జరిగిందంటే?
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయూబ్ ఖోసో తెలిపిన వివరాల ప్రకారం, ముసాఖేల్ జిల్లాలోని రరాషమ్ ప్రాంతీయ రహదారిపై వెళ్తున్న బస్సును సాయుధులు ఆపారు. తర్వాత ప్రయాణికుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. ఆ తర్వాత 23 మందిని కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. మృతులంతా పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ పంజాబ్‌కు చెందినవారని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఈ దాడికి ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. మరో ఘటనలో బలూచిస్థాన్‌లోని ఖలాత్ జిల్లాలో ముష్కరులు నలుగురు పోలీసు అధికారులతో సహా కనీసం 10 మందిని హతమార్చారని అధికారులు తెలిపారు.