Banana Cola Balls Recipe in Telugu : చాలా మందికి సాయంత్రం కాగానే స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ఇంట్లో పకోడీ, బజ్జీలు, గారెలు వంటి రకరకాల స్నాక్స్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. అందుకే, మీకోసం ఒక సూపర్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, "తమిళనాడు స్పెషల్ అరటి కోలా బాల్స్". ఇవి చాలా రుచికరంగా ఉంటాయి! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- అరటికాయలు - 2
- పల్లీలు - 1 కప్పు
- కొబ్బరి తురుము - పావు కప్పు
- అల్లం - అంగుళం ముక్క
- పచ్చిమిర్చి - 2
- కారం - టేబుల్‌స్పూన్
- పసుపు - పావు చెంచా
- సోంపు - పావు చెంచా
- ఇంగువ - చిటికెడు
- సన్నని ఉల్లిపాయ తరుగు - ముప్పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - చారెడు
- కరివేపాకు - 2 రెమ్మలు
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా అరటికాయల చివర్లు కట్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చుకొని తొక్క తీసి తురుముకొని పక్కనుంచాలి.
- అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి. కొత్తిమీర, కరివేపాకుని సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని పల్లీలను వేసి వేయించుకోవాలి. ఆపై వాటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, సోంపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పల్లీల మిశ్రమం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అరటికాయ తురుము, సన్నని ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, కొబ్బరి తురుము వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో నుంచి కొద్దికొద్దిగా పిండిముద్దను తీసుకొని నిమ్మకాయంత సైజ్‌లో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలను కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే టేస్టీ "అరటి కోలా బాల్స్" రెడీ!
- వీటిని చట్నీ లేదా సాస్‌తో తింటే సూపర్‌గా ఉంటాయి. మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ చాలా చాలా ఇష్టంగా తింటారు!
ఇవీ చదవండి :
గుడ్డు లేకుండా అద్దిరిపోయే "బ్రెడ్ ఆమ్లెట్" - ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా కావాలంటారు!
బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!