తెలంగాణ

telangana

ETV Bharat / international

మస్క్‌ డైరెక్షన్‌, ట్రంప్‌ యాక్షన్‌! అమెరికాకు మళ్లీ 'షట్‌ డౌన్‌' ముప్పు!! - US SHUTDOWN 2024

అమెరికా ద్రవ్య వినిమయ బిల్లుకు ట్రంప్‌ అభ్యంతరం- మస్క్ సూచన ప్రకారమేనని ట్రంప్ ఇలా చేశారట!

US Government Shutdown Trump
US Government Shutdown Trump (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2024, 11:25 AM IST

US Government Shutdown Trump :అధికార మార్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్‌ సమయంలో షట్‌డౌన్‌ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్‌ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అకస్మాత్తుగా తిరస్కరించారు. దీనిపై తప్పనిసరిగా చర్చ జరిగేలా చూడాలని స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌, రిపబ్లికన్‌ చట్టసభ్యులకు కోరారు.

ట్రంప్ నిర్ణయం వెనుక మస్క్!
ఫెడరల్‌ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే, ట్రంప్‌ ఈ నిర్ణయం వెనక ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రభావం ఉన్నట్లు సమాచారం. బైడెన్‌ సర్కార్ తీసుకొచ్చిన నిధుల ప్లాన్‌లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1500 పేజీల ఈ బిల్లు మంగళవారం రాత్రి బయటకు రాగానే మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'దీన్ని ఆమోదించకూడదు' అని రాసుకొచ్చారు. ఈ బిల్లుపై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది గంటలకే ట్రంప్‌ దీనిపై రిపబ్లికన్‌ నేతలకు అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.

బిల్లుపై ఉత్కంఠ
అయితే ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారంలోగా ఆమోదం పొందాలి. ఈ నేపథ్యంలో బుధవారం దీనిపై ట్రంప్‌, కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైనవారని తెలిపారు. ఈ బిల్లును ఆమోదించకూడదని, దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌, ఇతర రిపబ్లికన్‌ చట్టసభ్యులకు సూచించారు. దీంతో పాటు కొన్ని డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ద్రవ్యవినిమయ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

డెమొక్రట్లు ఫైర్
బైడెన్ సర్కార్ తాజాగా తీసుకొచ్చిన ఆర్థిక ప్రణాళికలో హరీకేన్‌ బాధిత రాష్ట్రాలు, ఇతర ప్రకృతి విపత్తుల బాధితుల కోసం 100.4 బిలియన్‌ డాలర్లు విపత్తు సహాయ నిధి కింద కేటాయించారు. తాజా పరిణామాలపై డెమొక్రటిక్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా జరిగితే యావత్‌ అమెరికన్లు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోపిస్తున్నారు.

మస్క్​కు కీలక పదవి
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో తన విజయంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్‌ మస్క్​కు ట్రంప్‌ తన కొత్త పాలకవర్గంలో కీలక పదవి కట్టబెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా తీసుకురాబోతున్న డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథిగా మస్క్​ను నియమించారు. అయితే, మస్క్ ఇంకా ఆ బాధ్యతలు చేపట్టకముందే ట్రంప్‌ నిర్ణయాలను మస్క్‌ నియంత్రిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

సుందర్ పిచాయ్​ ఫోన్​ కాల్ - ట్రంప్​నకు చేస్తే ఎలాన్ మస్క్ కనెక్ట్ అయ్యాడు!

హష్‌ మనీ కేసులో ట్రంప్‌నకు భారీ షాక్‌ - ఇక శిక్ష తప్పదా?

ABOUT THE AUTHOR

...view details