Flight Tire Falls Off :అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌కు బయలుదేరిన యునైటైడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానానికి పెను ప్రమాదం తప్పింది. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో ఎడమ వైపున ల్యాండింగ్ గేర్ వద్ద ఉన్న టైరు ఊడిపోయింది. దీంతో పైలెట్లు లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫ్లైట్‌ను దారి మళ్లించారు. ల్యాండింగ్ సమయంలో విమానంలో మంటలు చెలరేగితే అదుపు చేయడానికి లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. పైలెట్లు విమానాన్ని చాకచక్యంగా రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ చేయడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అయితే విమానం టైరు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని పార్కింగ్ కేంద్రంలో ఉన్న ఓ కారుపై పడటం వల్ల అది ధ్వంసమయ్యిందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.
విమానంలోని టైర్లకు నష్టం జరిగినా లేదా ఊడిపోయిన సురక్షితంగా ల్యాండ్ అయ్యేటట్లు దాన్ని నిర్మించారని విమానయాన సంస్థ యునైటైడ్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చుతామని పేర్కొంది. బోయింగ్ 777 విమానాలకు కుడి, ఎడమ భాగాల్లోని మెయిన్ ల్యాండింగ్ గేర్ల వద్ద పన్నెండు టైర్లు ఉంటాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ విభాగం దర్యాప్తు చేపడుతుందని అధికారులు తెలిపారు.