తెలంగాణ

telangana

ETV Bharat / international

కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని మోదీ - PM MODI ON HINDU TEMPLE ATTACK

హిందూ దేవాలయంపై దాడి - భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు - కెనడాలో మితిమీరిన ఖలిస్థానీ మూకల ఆగడాలు -

PM Modi
PM Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 9:05 PM IST

PM Modi On Hindu Temple Attack :కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్థానీ అనుకూల మూకలు చేసిన దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద చర్యలు భారత్ స్థైరాన్ని ఏమాత్రం బలహీనపరచలేవని స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్​లో ఓ పోస్ట్ పెట్టారు.

"కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. ఇవి భయంకరమైనవి. అయితే ఇలాంటి హింసాత్మక చర్యలు భారత స్థైరాన్ని ఎప్పటికీ బలహీనపరచలేవు. హిందూ దేవాలయంపై జరిగిన దాడి విషయంలో చట్టబద్ధత పాటించాలి, న్యాయం జరిగేలా కెనడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి."
- ప్రధాని నరేంద్ర మోదీ

బరితెగించిన ఖలిస్థానీ మూకలు
కెనడాలో ఖలిస్థానీలు మూకలు అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షించాలని మేం కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు’’ అని జైస్వాల్‌ అన్నారు.

బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు - హిందూ భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో సైతం తీవ్రంగా పరిగణించారు. కెనడాలోని ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని ఆయన పేర్కొన్నారు. అయితే కెనడాలో హిందూ దేవాలయాలపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. 2023లో విండ్‌సోర్‌లోని ఆలయ గోడలపై కొందరు దుండగులు భారత వ్యతిరేక నినాదాలను రాశారు.

ABOUT THE AUTHOR

...view details