Donald Trump Warning : అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఒహైయోలోని డేటన్ సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ట్రంప్ బృందం, బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చింది.
100శాతం దిగుమతి సుంకం
శనివారం ఒహైయోలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్, నవంబర్ 5న జరగనున్న ఎన్నికలు అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నాయని అన్నారు. అలాగే మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతి ఇవ్వనని తెలిపారు. 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు. పరోక్షంగా బైడెన్ వాహనాల పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకొని ఈ వ్యాఖ్యాలు చేశారు. ఈ సారి ఎన్నికలల్లో తాను గెలవకపోతే బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండవు అని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన బైడెన్
ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 'మరో జనవరి 6 కావాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారు. ఆయన ప్రతీకారాన్ని, అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారు.' అని జో బైడెన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థులల్లో ఉన్న ఒకరు మానసికంగా ఈ పదవికి అనర్హులు అని వాషింగ్టన్ ఓ సమావేశంలో జో బైడెన్ విమర్శించారు.