Khalistani Terrorist Arsh Dalla Arrested :భారత్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా (Arsh Dalla) ఎట్టకేలకు కెనడా పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. గత నెల కెనడాలోని ఓ పట్టణంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో అర్ష్ దల్లా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌కు అర్షదీప్ సింగ్ చాలా సన్నిహితుడు. అక్టోబరు 27, 28న మిల్టన్ పట్టణంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటనలో ఇతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి, తాజాగా అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లోనూ వివిధ నేర కార్యకాలాపాల్లో అర్షదీప్ ప్రమేయం ఉంది.
మోస్ట్ వాంటెడ్
ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్ దల్లాప్రస్తుతం తన భార్యతో కలిసి కెనడాలో నివసిస్తున్నాడు. అక్కడి నుంచే అపరేట్ చేస్తూ, పంజాబ్‌లో అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు బల్జీందర్ సింగ్ బల్లి హత్యకు కారణమయ్యాడు. తన తల్లి పోలీసుల కస్టడీలో ఉండడానికి కాంగ్రెస్ నేత కారణమని, అందుకే హత్యకు పాల్పడినట్లు గతంలో చెప్పాడు. ఇక్కడితో ఆగకుండా మరిన్ని నేరాలకు పాల్పడ్డాడు. దీనితో భారత్ ఇతడిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. తరువాత అనేక మంది అర్షదీప్ సహాయకులను అరెస్టు చేసింది. తాజాగా అర్ష్ దల్లా అరెస్టుపై భారత్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. కెనడా అధికారులతో దిల్లీ అధికారులు సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం.
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులు ఉన్నారు: జస్టిన్ ట్రూడో
ఇంతకు కొద్ది రోజుల ముందేకెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదుల ఉనికి ఉన్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తొలిసారి అంగీకరించారు. ఐతే మొత్తం సిక్కు సమాజాన్ని ఖలిస్థానీలుగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ట్రూడో వ్యాఖ్యల వల్ల భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ట్రూడో ప్రభుత్వం కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాదులకు చోటు ఇస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే కెనడా మాత్రం వారు తమ పౌరులనీ, అక్కడి చట్టాలకు లోబడే వారు నడుచుకుంటున్నారని చెబుతోంది.