Canada India Relations :భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ జస్టిన్ ట్రూడో సర్కారు మరో కవ్వింపు చర్యలకు పాల్పడింది. హ్యాకింగ్, సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్‌ను పేరును ప్రస్తావించింది. మరోవైపు కెనడాలో ఖలిస్థానీయులపై దాడుల వెనక భారత హోం మంత్రి అమిత్‌షా పాత్ర ఉందంటూ కథనాలు వెలువడటంపై అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది.
ఇరాన్, సౌత్ కొరియాలతో పాటు భారత్
2025-26 ఏడాదికి సంబంధించి 'జాతీయ సైబర్ ముప్పు అంచనా' నివేదికను కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ విడుదల చేసింది. ఇందులో భారత్ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. 'గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో కెనడాకు వ్యతిరేకంగా భారత్ నుంచి దేశ ప్రాయోజిత సైబర్ దాడులు జరగొచ్చని అంచనా వేస్తున్నాం. అంతర్జాతీయ వేదికపై అధికార శక్తిగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్ వంటి దేశాలు మాకు వ్యతిరేకంగా వివిధ స్థాయుల్లో సైబర్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. తమ దేశం ఎదుర్కొంటున్న సైబర్ ముప్పులు, ప్రాంతీయ ప్రత్యర్థుల నుంచి జరిగే హ్యాకింగ్‌పై దృష్టిపెడుతూనే విదేశాల్లో ఉన్న వారి అసమ్మతివాదులను (ఖలిస్థానీ వేర్పాటువాదులను ఉద్దేశిస్తూ) ట్రాక్ చేసేందుకు సైబర్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తున్నారు' అని కెనడా తమ నివేదికలో ఆరోపించింది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా తరహాలోనే భారత్‌ను కూడా తమ దేశానికి ముప్పుగా పరిగణిస్తున్నామంటూ మళ్లీ నోరు పారేసుకుంది.