తెలంగాణ

telangana

ETV Bharat / international

'మోదీ, జైశంకర్‌ పేర్లను మేమెప్పుడూ చెప్పలేదు'- వెనక్కి తగ్గిన కెనడా! - INDIA CANADA ROW

ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ తమ దేశ మీడియాలో వచ్చిన కథనాలను తిరస్కరించిన కెనడా

India Canada Row
India Canada Row (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 11:40 AM IST

India Canada Row : ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య ఘటన నేపథ్యంలో కెనడా మీడియాలో వచ్చిన సంచలన కథనంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడంపై భారత్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో కెనడా తాజాగా వెనక్కి తగ్గింది. ఆ కథనాలు అవాస్తవమని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

"ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరు 14వ తేదీన రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు, అధికారులు అసాధారణ చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు కెనడా గడ్డపై పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ నేర కార్యకలాపాలకు భారత ప్రధాని మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎన్నడూ పేర్కొనలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవన్నీ ఊహాజనితం, అవాస్తవమైనవే"
-కెనడా సర్కారు

అసలేం జరిగిందంటే?
కెనడాకు చెందిన ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్‌ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్‌ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు అందులోపేర్కొంది. భారత ప్రధాని నరేంద్రమోదీ పేరును కూడా ఇందులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. అవన్నీ హాస్యాస్పద వార్తలనేనని ఖండించింది. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజారుస్తాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కెనడా తాజాగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్‌ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ పేరును చేర్చడం వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్‌ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్‌ వెనక్కి రప్పించింది. అదే సమయంలో దిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్‌ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.

ABOUT THE AUTHOR

...view details