Modi Xi Jinping Bilateral Talks :రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 5 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. 'భారత్-చైనా సంబంధాలు రెండు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచశాంతికి, స్థిరత్వానికి ముఖ్యమని నమ్ముతున్నట్లు' ప్రధాని మోదీ తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీకగా నిలవాలని ఆయన చెప్పారు. సరిహద్దులో నాలుగేళ్లుగా ఉన్న సమస్యలపై ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
"ఐదేళ్ల తర్వాత అధికారికంగా మేము సమావేశం అవుతున్నాం. భారత్-చైనా సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో ముఖ్యమని విశ్వసిస్తున్నాం. గత నాలుగేళ్లుగా సరిహద్దులో తలెత్తిన సమస్యలపై ఇటీవల వచ్చిన ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాం. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం మన ప్రాధాన్యంగా ఉండాలి. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలి."
- ప్రధాని మోదీ
పరస్పర సహకారంతోనే సాధ్యం!
'భారత్-చైనాల మధ్య నెలకొన్న విభేదాలు, విరోధాలు సమసిపోవడానికి ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలని' చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.
ఐదేళ్ల తరువాత మళ్లీ భేటీ
మోదీ- జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల అత్యున్నతస్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ, కీలక గస్తీ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మోదీ-జిన్‌పింగ్ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 నవంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన జీ20 సమావేశంలో పాల్గొన్న మోదీ, జిన్‌పింగ్‌లు - ఓ విందులో కలిసి మాట్లాడారు. ఐదేళ్ల తరువాత మళ్లీ ఈ ఇరువురు నేతలు రష్యాలో భేటీ అయ్యారు.
మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు (AP) ఉజ్బెకిస్థాన్, యూఏఈ అధ్యక్షులతో భేటీ!
ప్రధాని మోదీ బ్రిక్స్ సమావేశం సందర్భంగా, విడిగా ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌తో భేటీ అయ్యారు. ఆ తరువాత యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
యుద్ధంతో కాదు - దౌత్యంతోనే పరిష్కారం
భారత్ మద్దతు - చర్చలు, దౌత్యానికే కాని యుద్ధానికి కాదని రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. శాంతియుత చర్చల ద్వారా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగియాలన్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజా, లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగేలా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాధ్యమైనంత త్వరగా ముగిసేలా బ్రిక్స్ ఒత్తిడి చేయాలని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.