Joe Biden On Israel :ఇరాన్ అణు కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులకు తాము మద్దతివ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం తెలిపారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విషయమై జీ7 దేశాలతో టెలిఫోన్లో జరిపిన చర్చల తర్వాత బైడెన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. జీ7 దేశాలు ఇరాన్‌పై విధించబోయే ఆంక్షల వివరాలను త్వరలో వెల్లడించవచ్చని బైడెన్ తెలిపారు. ఈ చర్చలో భాగంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు అన్ని సభ్యు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయని వైట్‌హౌజ్ ఓ ప్రకటనలో చెప్పింది. మరోవైపు, ఇరాన్ దాడికి కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్ట్ క్యాంప్‌బెల్ వెల్లడించారు. ఈవ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల చర్చలు కొనసాగుతాయన్నారు.
8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇదిలా ఉండగా, హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో జరిగిన పోరులో తమ సైనికులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకవైపు లెబనాన్‌లో దాడులు చేస్తూనే మరోవైపు గాజా, సిరియాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. శత్రు స్థావరాలు లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేశాయి.