Top Hezbollah Commanders Killed In Israeli Strike :లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడుతోంది. కీలక కమాండర్లను హతమారుస్తూ, హెజ్‌బొల్లా మిలటరీని చావుదెబ్బ తీస్తోంది. బీరుట్‌పై శుక్రవారం చేపట్టిన క్షిపణుల దాడుల్లో దాదాపు 16 మంది కమాండర్లు మృతి చెందారు. వారిలో హెజ్‌బొల్లా నం.2 నేత ఇబ్రహీం అకీల్‌తోపాటు, కమాండర్ అహ్మద్ మహ్మద్ వాహ్బీ ఉన్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. అకీల్ సహా కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టడం వల్ల హెజ్‌బొల్లా టాప్ సైనిక వ్యవస్థ దాదాపు విచ్ఛిన్నమైందని తెలిపింది.
ఇక మిగిలింది ముగ్గురే!
హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతోపాటు 8 మంది కీలక సైనిక కమాండర్లతో కూడిన మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ ఫొటోను ఐడీఎఫ్ 'ఎక్స్' వేదికలో పోస్ట్ చేసింది. అందులో ఇప్పటి వరకు తాము ఆరుగురు హెజ్‌బొల్లా కమాండర్లను మట్టుబెట్టినట్లు వెల్లడించింది. ప్రధానంగా ఐడీఎఫ్ దాడిలో అకీల్, ఫాద్ షుక్ర్, విస్సమ్ అల్ తావిల్, అబు హసన్ సమీర్, తాలెబ్ సమీ అబ్దుల్లా, మహమ్మద్ నాసర్‌లు హతమైనట్లు పేర్కొంది. సంస్థ చీఫ్ నస్రల్లా, అలీ కరాకీ (సదరన్ ఫ్రంట్ కమాండర్), అబూ అలీ రిదా (బేడర్ యూనిట్ కమాండర్)లు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలిపింది. తమ పౌరులకు హాని కలిగించే ఉగ్రశక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దక్షిణ లెబనాన్‌పై శుక్రవారం జరిపిన దాడుల్లో 180 హెజ్‌బొల్లా స్థావరాలను, వేలాది లాంచర్ బ్యారెళ్లను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
హెజ్‌బొల్లాకు శరాఘాతం
ఇజ్రాయెల్, బీరుట్‌పై చేసిన క్షిపణుల దాడుల్లో 16 మంది హెజ్‌బొల్లా కమాండర్లు మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 37కు పెరిగింది. మంగళ, బుధవారాల్లో జరిగిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో వణుకుతున్న హెజ్‌బొల్లా శ్రేణులకు ఈ దాడి శరాఘాతమే. మృతి చెందిన వారిలో సీనియర్ కమాండర్లు ఇబ్రహీం అకీల్, అహ్మద్ మహమూద్ వహబితో పాటు కీలక నేతలు ఉన్నారు. జులైలో హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో హతమయ్యారు. అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న అకీల్‌నూ ఇప్పుడు అదే తరహాలో మట్టుబెట్టడం గమనార్హం. ఈ దాడి వెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ కీలక పాత్ర పోషించిందని సమాచారం. రద్వాన్, అబ్బాస్ బ్రిగేడ్స్ అనేవి హెజ్‌బొల్లాలోని రెండు కీలక దళాలు. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హగాలిల్‌లో నిర్వహించాల్సిన ఓ సైనిక ఆపరేషన్ గురించి చర్చించడానికి శుక్రవారం ఈ దళాలకు చెందిన సీనియర్ కమాండర్లు సమావేశమయ్యారు. ఇందుకోసం దక్షిణ బీరుట్‌లోని ఓ భవనం కింద సొరంగాన్ని ఎంచుకున్నారు. ఇది జనావాసాల మధ్య ఉంది. ఈ భవనంలో హెజ్‌బొల్లా ఎన్నడూ సమావేశం కూడా కాలేదు. దీంతో ఎవరికీ ఈ భేటీ గురించి తెలిసే అవకాశం ఉండదని హెజ్‌బొల్లా భావించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ మాత్రం ఈ కీలక కమాండర్ల సమావేశ వివరాలను సేకరించింది. హెజ్‌బొల్లా శ్రేణుల్లోకి మొస్సాద్ చొచ్చుకుపోయిందనడానికి ఈ దాడే నిదర్శనమని ఓ పాత్రికేయుడు తెలిపారు. సీనియర్ కమాండర్ల మృతికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా దాదాపు 100 రాకెట్లను ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది.
స్కూల్ టార్గెట్‌గా గాజాలో దాడులు- 22 మంది మృతి - Israel Gaza War
హెజ్‌బొల్లాపై దాడులను ఖండించిన ఐక్యరాజ్యసమితి - Israel Lebanon War