Bangladesh Letter To India : మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ కోరింది. అందుకోసం భారత్‌కు దౌత్యపరమైన లేఖను పంపినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ ప్రక్రియలో భాగంగా హసీనాను విచారించేందుకు తిరిగి రప్పించాలని బంగ్లాదేశ్ కోరుకుంటుందని విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహిద్ హొస్సేన్ వెల్లడించారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశామని తెలిపారు.
'షేక్ హసీనాను మాకు అప్పగించండి' - భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ - BANGLADESH LETTER TO INDIA
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమంటూ భారత్ లేఖ
Published : Dec 23, 2024, 6:22 PM IST
మరోవైపు బంగ్లా హోంశాఖ కూడా హసీనాను రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని హోంశాఖ సలహాదారు జహంగీర్ ఆలమ్ పేర్కొన్నారు. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావచ్చని చెప్పారు.
ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమం, హత్యలు, ఇతర నేరాల ఆరోపణలపై షేక్ హసీనా సహా ఆమె పార్టీ అవామీ లీగ్‌కు చెందిన అగ్ర నాయకులు 45 మందిపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ అయింది. తమ ఎదుట హాజరుపరచాలని ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆదేశించింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో హసీనా తన పదవికి రాజీనామా చేసి ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు.