తెలంగాణ

telangana

ETV Bharat / international

తల్లి వద్దకు చేరని నావల్నీ మృతదేహం- రెండోసారి శవపరీక్షలు- అంతా కావాలనే! - అలెక్సీ నావల్నీ మృతదేహాం

Alexei Navalny Death : రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మృతదేహాన్ని అప్పగించకుండా మళ్లీ శవపరీక్షలు చేయాలని అధికారులు చెబుతున్నారు.

Alexei Navalny Death
Alexei Navalny Death

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 11:07 AM IST

Updated : Feb 18, 2024, 11:28 AM IST

Alexei Navalny Death : రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలెక్సీ నావల్నీ మరణవార్తను ఆయన తల్లికి అధికారికంగా తెలియజేసిన జైలు అధికారులు, ఇప్పటి వరకు మృతదేహాన్ని మాత్రం అప్పగించలేదు. మరోసారి శవపరీక్షలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు.

కావాలనే దాచిపెడుతున్నారు!
అలెక్సీ నావల్నీ మరణవార్త అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో ఉన్న జైలుకు లియుడ్మిలా వెళ్లారు. అయితే అప్పటికే నావల్నీ మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్‌ నగరానికి తరలించినట్లు అధికారులు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రాథమికంగా చేసిన శవపరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదు. అందుకే రెండోసారి చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్‌ వెల్లడించారు.

మరోవైపు నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరంలో నుంచి తుడిచిపెట్టాలనే అలా చేస్తున్నారని అంటున్నారు. ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:17 గంటలకు నావల్నీ మరణించినట్లు ఆయన తల్లికి జైలు అధికారులు తెలియజేశారు. సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌ వల్లే మృతిచెందారని పేర్కొన్నారు.

నావల్నీకి ప్రజలు నివాళలు

తీవ్రంగా స్పందించిన పశ్చిమ దేశాలు
నావల్నీకి నివాళులర్పించిన దాదాపు 100 మందిని రష్యా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరోవైపు ఆయన మృతిపై ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపించాయి. రష్యాలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నేతగా నావల్నీకి పేరుంది. ముఖ్యంగా రష్యా ప్రభుత్వం, పుతిన్‌కు వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వల్ల ప్రపంచ వ్యాప్తంగా నావల్నీ గుర్తింపు పొందారు. అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఆయనకు ఆదరణ లభించింది. గతంలో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. రాజకీయ కక్షసాధింపు చర్యల వల్లే నావల్నీని రష్యా జైలులో పెట్టినట్లు పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి.

నావల్నీకి ప్రజలు నివాళులు

నావల్నీ డ్యాకుమెంటరీ
రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు జీవితంలో జరిగిన పరిణామాలతో నావల్నీ అనే డాక్యుమెంటరీ కూడా తెరకెక్కింది. దీనికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆస్కార్ దక్కింది. గత ఏడాదే జైలు నుంచి నావల్నీ అదృశ్యమయ్యారని, తాము ఆయన్ని సంప్రదించలేకపోతున్నామని ఆయన న్యాయవాదులు ఆరోపించారు. 2023 డిసెంబర్‌లో నావల్నీని వ్లాదిమిర్‌ ప్రాంతంలో ఉన్న జైలు నుంచి అత్యంత భద్రతా కలిగిన పీనల్‌ కాలనీ జైలుకు మార్చారు.

పుతిన్ ప్రత్యర్థి నావల్నీ హఠాన్మరణం- జైల్లో నడుస్తూ మృతి

'నావల్నీ మృతికి పుతినే బాధ్యుడు- రష్యా అధ్యక్షుడు ఎంతకు తెగిస్తారో ప్రపంచానికి తెలిసింది!'

Last Updated : Feb 18, 2024, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details