Trump Hush Money Case Updates : పోర్న్ స్టార్‌కు హష్ మనీ ఇచ్చిన వ్యవహారంలో అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హష్ మనీ కేసులో ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ న్యూయార్క్ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే ట్రంప్ శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
హష్ మనీ కేసుపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌నకు జనవరి 10న శిక్ష విధిస్తానని న్యూయర్క్ జస్టిస్ హవాన్ మర్చన్ ఆదేశాలు జరీ చేశారు. మరోవైపు జనవరి 20న ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా 'అన్‌కండిషనల్ డిశ్చార్జ్'ని అమలుచేస్తామని తెలిపారు. శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు. శిక్ష విధించాలనే న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఖండించారు. ఈ చట్ట విరుద్ధమైన కేసును వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు.
శిక్ష ఖరారు!
హష్ మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. కనుక గతేడాది నవంబరులోనే న్యూయార్క్ కోర్ట్ శిక్ష ట్రంప్‌నకు ఖరారు చేయాల్సిఉంది. అయితే అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీనితో అమెరికా అధ్యక్షుడు క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది. కానీ తరువాత ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది. తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
ఇంతకీ హష్ మనీ కేసు అంటే ఏమిటి?
శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.